
- 4 ఏళ్ల తమ్ముడికి కేన్సర్.. 5 ఏళ్ల అక్క కేరింగ్
- అక్కాతమ్ముళ్ల అనుబంధం చూసి చలించిన నెటిజన్లు
ఈ ఫొటో చూస్తే.. ఏమనిపిస్తోంది? టాయిలెట్లో తమ్ముడు వాంతి చేసుకుంటుంటే అక్క వీపు నిమురుతూ ధైర్యం చెబుతున్నట్లు ఉంది కదూ! కానీ ఈ ఫొటో వెనక కన్నీళ్లు పెట్టించే కథ ఉంది. కేన్సర్ అనే మహమ్మారి అందుకు కారణమైంది. విషయంలోకి వెళ్తే.. అమెరికాకు చెందిన కైట్లిన్ అనే మహిళకు ఒక పాప, బాబు ఉన్నారు. అక్క ఆబ్రే వయసు ఐదేండ్లు. తమ్ముడు బెకెట్ బర్గ్ వయసు నాలుగేండ్లు. ఇద్దరూ మంచి దోస్తుల్లాగా కలిసి ఆడుకునేవాళ్లు. స్కూలుకెళ్లినా, ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే ఉండేవారు. కానీ.. సడెన్‌గా గత ఏడాది ఏప్రిల్‌లో బెకెట్మంచాన పడ్డాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఒక్కసారిగా తన తమ్ముడి చుట్టూ డాక్టర్లు మూగి, సూదులు గుచ్చుతూ రకరకాల మందులు ఎక్కిస్తుంటే.. ఏం జరుగుతోందో అర్థం కాక ఆబ్రే చూస్తూండిపోయింది. నిన్నటి వరకూ హుషారుగా ఉన్న తమ్ముడు ఈ రోజు లేవలేకపోతున్నాడు. వాడికి ఏదో అయిందని మాత్రమే ఆ చిట్టితల్లికి అర్థమైంది. బెకెట్‌కు అక్యూట్లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనే అరుదైన కేన్సర్ వచ్చిందని, ట్రీట్మెంట్కు తరచూ రావాలని చెప్పి డాక్టర్లు ఇంటికి పంపించారు. తమ్ముడికి వచ్చిన కేన్సర్ గురించి ఆబ్రేకు తెలియకపోయినా, అతడికి వచ్చిన కష్టం మాత్రం ఆమెకు అర్థమైంది. ఇక అప్పటి నుంచి తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఆబ్రే. కీమోథెరపీ ఎఫెక్ట్‌తో తమ్ముడు వాంతులు చేసుకుంటుంటే టాయిలెట్లో ఇలా సాయం చేస్తుండగా చూసి, కరిగిపోయిన తల్లి కైట్లిన్ వారి ఫొటోను తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘పిల్లలకు కేన్సర్ వస్తే.. ఆ కుటుంబమంతా తల్లడిల్లిపోతుంది’ అంటూ తమ కుటుంబానికి వచ్చిన ఆపదను కూడా వివరిస్తూ పోస్ట్పెట్టింది. అభం శుభం ఎరుగని వయసులో ఆ తమ్ముడి కోసం అక్క తీసుకుంటున్న కేర్ ను, ఇంటి పనుల్లోనూ ఓ చేయి వేస్తూ చేస్తున్న సాయాన్ని వివరిస్తూ ఆమె పెట్టిన పోస్టు ఎంతో మంది నెటిజన్లను కదిలించింది. వాళ్లిద్దరి అనుబంధాన్ని మెచ్చుకుంటూ, బెకెట్పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. వీరి గురించి తెలిసి బాగా చలించిపోయిన మరికొందరు.. ఈ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఫండ్రైజింగ్ప్రారంభించారు. దీంతో చాలా మంది ఈ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూడా ముందుకొస్తున్నారట.