చండీగఢ్: వివాహ వేడుకల్లో భాగంగా వధువుపై ఆమె కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయల నోట్లను వర్షంలా కురిపించారు.. వేదిక వద్ద నిలుచున్న వధువుపై ఓ యువకుడు సంచీలో నుంచి నోట్లకట్టలు తీసి వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వధువుపై వారు మొత్తంగా రూ.8.5 కోట్ల విలువైన డబ్బును వెదజల్లారని ప్రచారం జరుగుతోంది.
పంజాబ్‌లోని తర్న్ తరణ్ జిల్లాలో ఫిబ్రవరి 14న ఓ పెండ్లి జరిగింది. ఈ వేడుకలో వధువుపై రూ.8.5 కోట్ల నగదును కురిపించినట్టు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వరుడి సోదరుడు సికందర్ సింగ్ స్పందిస్తూ.. వేడుకలో సంతోషంతో డబ్బులు వెదజల్లిన మాట వాస్తవమే కానీ ఆ కరెన్సీ నోట్ల విలువ రూ.2 లక్షలలోపే ఉంటుందని వివరించారు.
దీనిని కోట్లలో చూపిస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వేడుకను నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, డీజే కూడా ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. డాలర్ నోట్లతో కలిపి సుమారు రూ.4 లక్షల విలువైన నోట్లను వెదజల్లామని, కోట్లాది రూపాయల లెక్క ఎలా వచ్చిందో తమకు తెలియదని పేర్కొన్నారు.
