న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ముడి చమురు కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడ్డ ఇండియాలో కూడా ఇంధన కొరత వేధిస్తోంది. దీంతో ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం జపిస్తోంది. దేశ ప్రజలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వారానికి రెండు రోజులు వర్చువల్ పద్దతిలో విచారణలు చేపట్టాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ శుక్రవారం (మే 15) సర్క్యూలర్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సర్క్యూలర్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఈ సర్క్యూలర్ ప్రకారం.. వారానికి రెండు రోజులు (సోమ, శుక్ర) వర్చువల్ పద్దతిలో విచారణలు జరుగుతాయి. అలాగే, ఆఫ్‌లైన్ విచారణలు జరిగే రోజుల్లో న్యాయమూర్తులు కార్‌పూల్ ద్వారా కోర్టుకు రావాలని సూచన. పిటిషనర్లు, న్యాయవాదులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వీడియో కాన్ఫరెన్సింగ్ లింకులను సకాలంలో అందించేలా సాంకేతిక ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చూడాలని కోర్టు యంత్రాంగానికి ఆదేశాలు జారీ.
సుప్రీంకోర్టులోని ప్రతి శాఖ, ప్రతి విభాగంలో 50 శాతం వరకు ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా మిగిలిన సిబ్బంది కార్యాలయంలో తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటి నుండి పని చేయడానికి అనుమతించబడిన ఉద్యోగులు అన్ని వేళలా ఫోన్‌లో అందుబాటులో ఉండాలని.. అవసరమైనప్పుడు వెంటనే కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేశారు.
