- తక్కువ నీటితో సాగయ్యే పంటలు సాగు చేయాలి
- ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం
కోల్‌బెల్ట్/ చెన్నూరు, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొందామని, రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 40 శాతం వర్షపాతమే నమోదయ్యిందని, ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు.
ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి.. విద్యార్థులతో మాట్లాడారు. ఎనిమిదో వార్డులో రూ.1.40 కోట్లతో నిర్మించిన బైపాస్ రోడ్డు, 4వ వార్డు నల్లగొండ పోచమ్మ వాడలో బోర్వెల్ను మంత్రి ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి, ఇతర అభివృద్ది పనులను పరిశీలించారు.
అనంతరం మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, -ప్రత్యామ్నాయ పంటలు’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేక్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగునీటికి కొరత ఉంటుందని, అందువల్ల రైతులు వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లోటు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని, నవంబర్‌లో వర్షం కురిసే అవకాశం ఉన్నా పంటలకు నష్టం వాటిల్లే చాన్స్ ఉందన్నారు.
భూగర్భ జలాలు కూడా అడుగంటినందున ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని, పప్పు ధాన్యాలు, పత్తి, కూరగాయలు, ఆయిల్ పామ్‌లాంటి తక్కువ నీరు అవసరం ఉన్న పంటలు సాగు చేయాలన్నారు. ఈ పంటలకు అవసరమైన రాయితీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆయిల్పామ్సాగు చేయాలని, ఈ పంట సాగు చేస్తే నష్టపోయే ప్రసక్తే లేదని చెప్పారు.
రైతులపై రాజకీయం చేస్తే ఊరుకోం
కాళేశ్వరం పంపులు నడపాలని హరీశ్‌రావు, కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, గేట్లు మూయకుండా పంపులు నడపగలిగితే బ్యారేజీలు ఎందుకు కట్టారని మంత్రి వివేక్‌వెంకటస్వామి మండిపడ్డారు. రైతుల సమస్యలను పక్కన బెట్టి రాజకీయ కుట్రలు చేస్తున్నారన్నారు. చెన్నూరులో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్నీచ రాజకీయాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. లక్షెట్టిపేట నుంచి వచ్చిన కొందరు విద్యార్థులను రాజకీయాల కోసం వాడుకొని వెళ్లగొట్టారన్నారు.
అంతకుముందు మైనార్టీ హాస్టల్‌లో కూడా బీఆర్‌ఎస్ లీడర్లు భోజనంలో కారం వేసి.. ఫొటోలు తీసి.. ప్రభుత్వంమీద , తనమీద బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టళ్లలోకి చొరబడి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే స్థానికంగా ఉండేవాడు కాదని, తాను వారానికి రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని మంత్రి వివేక్ చెప్పారు.
చెన్నూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరులో రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారస్తులు, స్థానికులు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమన్నారు. రూ.1.40 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తే మున్సిపల్ఎన్నికల కోసమేనంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయని, కానీ 3 నెలల్లో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి చేతల్లో చూపించామని తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో నిధులు లేకపోయినా శంకుస్థాపనలు చేసి వదిలేశారని విమర్శించారు. రూ.1.20 కోట్ల డీఎంఎఫ్‌డీ నిధులతో 20 షాపులను నిర్మించి అర్హులైన పేద వ్యాపారులకు కేటాయిస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన వారికి షాపులు కేటాయిస్తామని చెప్పారు. చెన్నూరు చెరువులోని శివాలయం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానన్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ వినయ్, డీఏవో సురేఖ, హార్టికల్చర్ జిల్లా ఆఫీసర్ అనిత, ఎలక్ట్రిసిటీ డీవో కైసర్, ఏడీఏ బానోత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
