పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం... సేఫ్టీ సంస్కృతిని పెంపొందించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం... సేఫ్టీ సంస్కృతిని పెంపొందించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రిస్కీ ఆపరేషన్లలో కాంట్రాక్ట్ కార్మికులు వద్దు
  • ఎఫ్‌‌టీసీసీఐలో ‘ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టిబుల్ డస్ట్స్’ జాతీయ స్థాయి వర్క్‌‌షాప్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ సంపూర్ణ భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని కార్మిక, ఫ్యాక్టరీల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లక్డీకాపూల్‌‌లోని ఎఫ్‌‌టీసీసీఐలో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టిబుల్ డస్ట్స్’ జాతీయ స్థాయి రెండు రోజుల వర్క్‌‌షాప్‌‌ను మంత్రి ప్రారంభించారు. 

అనంతరం కంబస్టిబుల్ డస్ట్‌‌పై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికులు సమన్వయంతో బలమైన సేఫ్టీ సంస్కృతిని అలవర్చుకోవాలన్నారు. కార్పొరేట్ కంపెనీల బోర్డు సమావేశాల్లో భద్రతపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని, రక్షణపై పెట్టే ప్రతి రూపాయిని ఖర్చుగా కాకుండా పెట్టుబడిలా చూడాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన వ్యాపార స్వేచ్ఛను భద్రతా లోపాలకు సాకుగా చూపవద్దని హెచ్చరించారు.

ప్రమాదకర విభాగాల్లో కాంట్రాక్ట్ సిబ్బంది వద్దు..

హై-రిస్క్, అత్యంత ప్రమాదకర కార్యకలాపాలు సాగే పారిశ్రామిక విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించే సంస్కృతికి తక్షణమే స్వస్తి పలకాలని మంత్రి ఆదేశించారు. సిగాచి ఘటనను గుర్తుచేస్తూ.. తగిన అనుభవం, శిక్షణ లేని కాంట్రాక్ట్ కార్మికుల నియామకమే ప్రమాదాలకు కారణమన్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రమాదకర ప్రాసెస్ ప్రాంతాలలో కేవలం అనుభవజ్ఞులైన పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే పనిచేసేలా కఠిన నిబంధనలు రూపొందించాలని ఫ్యాక్టరీల శాఖను ఆదేశించారు. 

లీకేజీ ముప్పు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ఎస్​ఓపీని తయారు చేసి అన్ని పరిశ్రమల్లో అమలయ్యేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సీఎస్ఆర్ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్ మోహన్ బాబు, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ప్రతినిధులు, ఫ్యాక్టరీల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.