వోల్వో తొలి ఎలక్ట్రిక్ కారు

వోల్వో  తొలి ఎలక్ట్రిక్ కారు

కరెంటుతో నడిచే ఎలక్ట్రిక్ కారును వోల్వో కంపెనీ ఇవాళ విడుదల చేసింది.  దీని పేరు ‘ ఎక్స్‌సీ40 రీఛార్జ్‌’. ఎక్స్‌షోరూం ధర రూ.55.90 లక్షలు.రేపటి నుంచి వోల్వో కంపెనీ వెబ్‌సైట్‌లో బుకింగ్స్‌ మొదలు కానున్నాయి. రూ.50 వేలు పే చేసి ఈ  కారును బుక్‌ చేసుకోవచ్చు. అక్టోబరు నుంచి వినియోగదారులకు కారును డెలివరీ చేస్తారు.  ఈ కారు రెండు విద్యుత్తు మోటార్లతో నడుస్తుంది. కేవలం 4.9 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్‌ దాకా వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగాన్ని 180 కేఎంపీహెచ్‌కు పరిమితం చేశారు.

కారులో 78 కేడబ్ల్యూహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 418 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. 150 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 40 నిమిషాల్లో సున్నా నుంచి 80 శాతం దాకా ఛార్జ్‌ అవుతుంది. అదే సాధారణ 11కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో అయితే పూర్తి ఛార్జింగ్‌కు ఎనిమిది గంటలు పడుతుంది.  మనదేశంలో అసెంబుల్‌ చేస్తున్న తొలి విలాసవంత విద్యుత్తు కారు ఇదే కావడం విశేషం. బెంగళూరు సమీపంలోని హోసకోటె తయారీ కేంద్రంలో ఈ కారును అసెంబుల్‌ చేయనున్నారు.