హుజురాబాద్ ఎన్నికల చరిత్ర: ఈ సారి ఓటర్లు ఎటువైపు..

హుజురాబాద్ ఎన్నికల చరిత్ర: ఈ సారి ఓటర్లు ఎటువైపు..

ఏడు దశాబ్దాల హుజురాబాద్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడి బైపోల్ ఆసక్తికరంగా మారింది. రాజకీయ చైతన్యానికి వేదికైన హుజురాబాద్ నియోజకవర్గం ఓటర్లు.. ఈసారి ఎటువైపు మొగ్గుతారనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమమైనా, అభివృద్ధి నినాదమైనా ఆచితూచి స్పందించే ఇక్కడి ఓటరు నాడి పట్టుకునేందుకు ఈసారి పొలిటికల్ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన గత ఎన్నికలు.. నియోజకవర్గ చరిత్ర.. ఇక్కడి ఓటర్ల చైతన్యం, వారిచ్చే తీర్పు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ప్రధాన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోటా పోటీ ప్రచారాలు జరిగాయి. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలు ఖర్చు పెడుతున్న పరిస్థితి.  ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చెబుతున్నారు. 

హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాలు మినహా.. మొత్తం ఓటర్లంతా గ్రామీణులే. ఈ రెండు పట్టణాల్లోని వారు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారో.. లేదంటే గ్రామీణ నేపథ్యమున్నవారే ఉన్నారు. ఈ రెండు పట్టణాల్లో జరిగే వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు కూడా వ్యవసాయ, రైతు ఆధారంగా జరిగేవే. హుజురాబాద్ నుంచి గెలిచిన నేతల్లో చాలా మందికి ఇప్పటి వరకు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. దాదాపు ఏడేళ్లు మంత్రిగా పనిచేశారు. గతంలో ఇనుగాల పెద్దిరెడ్డి, ముద్దసాని దామోదర్ రెడ్డిలాంటి వాళ్లు ఇక్కడి నుంచి గెలిచి సర్కారులో కీలక మంత్రులుగా పనిచేశారు. 

కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ తో పాటు ఇండిపెండెంట్లను కూడా ఆదరించిన నియోజకవర్గమిది. రాజకీయ పరిణతికి పెట్టింది పేరైన హుజురాబాద్ సెగ్మెంట్ లో ఇప్పుడు ఈటల రాజీనామాతో మరోసారి ఉపఎన్నికలొచ్చాయి. శనివారం  పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. 

హుజురాబాబాద్ సెగ్మెంట్ పరిధిలో హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని 93 గ్రామపంచాయతీలతో పాటు, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలున్నాయి. తాజా జాబితా ప్రకారం మొత్తం 2 లక్షల 36 వేల 873 మంది ఓటర్లున్నారు. వీరిలో లక్షా 17 వేల 779 మంది పురుషులు, లక్షా 19 వేల 93 మంది మహిళలు, ఓ ట్రాన్స్ జెండర్ ఓటరు ఉన్నారు. మండలాల వారిగా చూస్తే.. అత్యధికంగా హుజురాబాద్ మండలంలో 61 వేల 673 మంది ఓటర్లు ఉండగా, రెండో స్థానంలో జమ్మికుంట మండలంలో 59 వేల 20 మంది, కమలాపూర్ మండలంలో 51వేల 282 మంది ఓటర్లు ఉన్నారు. నాలుగో స్థానంలో వీణవంక మండలంలో 40 వేల 99 మంది ఓటర్లు, ఇల్లందకుంట మండలంలో అతి తక్కువగా 24 వేల 799 మంది ఓటర్లు ఉన్నారు. 

మొత్తం ఓటర్లలో 64 శాతం మంది బీసీలు,  21 శాతం మంది ఎస్సీలు, 2 శాతం మంది ఎస్టీలు,  8 శాతం ఓసీలు, ఇతర వర్గాలు మరో 5 శాతం ఉన్నారు. సెగ్మెంట్ లో రెడ్డి సామాజికవర్గం 22 వేల ఓట్లు, కాపు 29 వేల ఓట్లు, పద్మశాలి 28 వేలు, గౌడ వర్గం 26,000, గొల్ల కుర్మ 25 వేలు, ముదిరాజ్ 26 వేల ఓట్లు, ఎస్సీలు 46 వేలు, ఎస్టీలు 6500, ముస్లిమ్స్ 12 వేల ఓట్లున్నాయి