ఏకగ్రీవం వద్దు.. ఎన్నికలు పెట్టాలి..చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో 17వ వార్డు ఓటర్ల నిరసన

ఏకగ్రీవం వద్దు.. ఎన్నికలు పెట్టాలి..చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో 17వ వార్డు ఓటర్ల నిరసన
  • విత్​డ్రా చేసుకున్న మహిళపై ఆరోపణలు.. ఆత్మహత్యాయత్నం

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మున్సిపాలిటీలోని 17వ వార్డును ఏకగ్రీవంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఓటర్లు చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ‘కొందరు కుమ్మక్కై మా ఓటు అమ్ముకున్నారు. మాకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలి’ అంటూ ఆందోళన చేపట్టారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 17వ వార్డు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తరఫున చింతల ఉమామహేశ్వరి నామినేషన్లు దాఖలు చేయగా, ఆమెకు రెండు పార్టీల నుంచి బీ ఫారాలు అందాయి. 

నామినేషన్​ వేసిన నలుగురిలో నాటకీయ పరిణామాల మధ్య ముగ్గురు విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నారు. దీంతో ఉమామహేశ్వరి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ పరిణామంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకగ్రీవాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ ఎదుట ధర్నా చేపట్టారు. తమ ఓటు హక్కును హరించారని, ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా నామినేషన్ విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్న మల్లమ్మపై కొందరు ఓటర్లు ఆరోపణలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు తలుపులు పగలకొట్టి ఆమెను కాపాడారు.