“మేమేం తినాలి.. ఎట్లా బతకాలి “:మంత్రిని నిలదీసిన మహిళా కండక్టర్లు

“మేమేం తినాలి.. ఎట్లా బతకాలి “:మంత్రిని నిలదీసిన మహిళా కండక్టర్లు

మహబూబ్​నగర్, వెలుగు: ‘పండుగ పూట పస్తులున్నం.. మేమేం తినాలి.. ఎట్లా బతకాలి’ అంటూ మహిళా కండక్టర్​ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను మహబూబ్​నగర్​లో శుక్రవారం నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా వస్తుంటే మంత్రి తన కారు ఆపి దిగి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘ఐదారుగురు కలిసి లొల్లి చేస్తున్నరు. సమ్మెపై అవసరమైతే మాట్లాడటానికి రెడీ, సమస్యను సార్​దగ్గరకు తీసుకెళ్తా’నని అన్నారు. ఇంతలో ఓ మహిళ కండక్టర్​ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో మంత్రి ‘అమ్మా నీ వయస్సు చిన్నది.. ఇలా మాట్లాడితే ఎలా..’ అని సముదాయించే ప్రయత్నం చేశారు. ‘వయస్సు చిన్నదే సార్, కానీ మా ఆవేదన పెద్దది.. అర్థం చేసుకోండి’ అంటూ సమాధాన మిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. మీరు రమ్మంటే మీ సమస్యలను వినడానికి వచ్చానని, ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.