- ఉద్దెర ఇచ్చేది లేదంటున్న ఆయిల్ కంపెనీలు
- పూర్తి అమౌంట్ కడ్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా
- పెద్దమొత్తం చెల్లించలేక కొనుగోళ్లు తగ్గించుకుంటున్న డీలర్లు
- పలుచోట్ల మూతపడ్తున్న బంకులు
- నో స్టాక్ బోర్డులపై సివిల్ సప్లయ్ ఆఫీసర్ల సీరియస్
- మూసేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- యాదాద్రి జిల్లాలో ఐదు బంకులకు నోటీసులు
హైదరాబాద్/సిటీ/నెట్వర్క్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పెద్దసంఖ్యలో పెట్రోల్‌బంకులు మూతపడ్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌సహా జిల్లాకేంద్రాల్లో వందలాది బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. ఆయిల్ కంపెనీలకు, డీలర్లకు మధ్య నెలకొన్న ‘ఉద్దెర’ సమస్యే ఇందుకు కారణమని తెలుస్తుండగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకాలం డీలర్లకు క్రెడిట్‌పై పెట్రోల్, డీజిల్సరఫరా చేసిన కంపెనీలు ఇప్పుడు ‘నో క్రెడిట్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాతే ఇంధనం సరఫరా చేస్తున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేని డీలర్లు కొనుగోళ్లు తగ్గించుకోవడంతో బంకుల్లో కొరత ఏర్పడింది. ఇన్నాళ్లూ ఉద్దెర ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపుతూ క్రెడిట్ ఇవ్వడం లేదని, పైగా పెండింగ్ అమౌంట్పూర్తిగా చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో బంకులు మూసేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే బంకుల వద్ద నో స్టాక్‌బోర్డులు పెడ్తున్న నిర్వాహకులపై సివిల్ సప్లై ఆఫీసర్లు సీరియస్ అవుతున్నారు. కంపెనీలకు వెంటనే డబ్బులు చెల్లించి, పెట్రోల్, డీజిల్తెప్పించుకోవాలని.. అలాకాకుండా బంకులు మూసేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం యాదాద్రి జిల్లాలోని ఐదు బంకులకు నోటీసులు జారీ చేశారు.
25 శాతం వరకు తగ్గిన పెట్రో కొనుగోళ్లు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,200 పెట్రోల్ బంకులు ఉండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 1,200కు పైగా ఉన్నాయి. సాధారణంగా రోజుకు 40 లక్షల నుంచి 70 లక్షల లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో డీలర్లు దాదాపు 25 శాతం వరకు కొనుగోళ్లు తగ్గించినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల క్రితం జిల్లాల్లో మొదలైన సమస్య క్రమంగా నగరానికి పాకింది. సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జనగామ లాంటి జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని అంబర్‌పేట్, చిక్కడపల్లి, బంజారాహిల్స్, లంగర్‌హౌజ్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అనేక బంకులు మూతపడ్డాయి. దీంతో స్టాక్ఉన్న బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూల్లో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెట్రోల్ కొరత ఉందనే వదంతులు వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతున్నది. ఇప్పటివరకు ట్రావెల్ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలకు క్రెడిట్‌పై ఇంధనం అందించిన బంకులు ఇప్పుడు చేతులెత్తేయడంతో ఆ రంగాలపై కూడా ప్రభావం పడుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైతం ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్నాయి.
సరఫరా సమస్య కాదు.. ఆర్థిక సమస్య: ఎక్స్‌పర్ట్స్
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని నిపుణులు ఖండిస్తున్నారు. ఆయిల్ కంపెనీల వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని.. ప్రస్తుతం ఏర్పడింది సరఫరా సమస్య కాదని, ఆర్థిక లావాదేవీల కారణంగా తలెత్తిన తాత్కాలిక ఇబ్బందేనని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో కంపెనీలు బాకీలు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. వాహనదారులు ఆందోళనకు గురికాకుండా అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నాలుగు బంకులు ఉండగా.. సోమవారం మూడుచోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టారు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉండడంతో వాహనదారులు క్యూ కట్టారు. లక్సెట్టిపేటలో మూడు బంకులు ఉండగా, ఒక దాంట్లో స్టాక్ లేదు. జన్నారంలో మూడు బంకులకుగాను రెండింటి వద్ద నోస్టాక్బోర్డులు కనిపించాయి. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
యాదాద్రి జిల్లాలో పలు పెట్రోల్‌బంకులు నో స్టాక్ బోర్డులు పెడ్తుండడంతో సివిల్ సప్లై అధికారులు ఆరా తీస్తున్నారు. కంపెనీలు క్రెడిట్‌పై పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక బంక్‌లను మూసివేశామని కొందరు చెప్పగా, డీడీలు తీయడానికి రెడీగా ఉన్నా ఆయిల్ కంపెనీలు వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టడం వల్ల బంద్పెట్టామని మరికొందరు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయా పెట్రోల్‌బంకుల్లో సివిల్ సప్లై శాఖ అధికారులు తనిఖీలు చశారు. 24 గంటల్లో క్రెడిట్ డబ్బులు చెల్లించి కొత్తగా ఇండెంట్ పెట్టి పెట్రోల్, డీజిల్తెప్పించాలని, లేదంటే లైసెన్స్క్యాన్సిల్చేస్తామని హెచ్చరించారు.
ఐదు బంక్‌లకు నోటీసులిచ్చాం
పెట్రోల్ బంకుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ నో స్టాక్ బోర్డులు పెట్టొద్దు. ఇప్పటికే ఐదు బంక్‌లకు నోటీసులు ఇచ్చాం. నోటీసులు అందుకున్న 24 గంటల్లో బంక్‌లకు స్టాక్ తెప్పించి ఓపెన్ చేయాలి. లేదంటే ఆ బంక్‌ల లైసెన్స్ క్యాన్సిల్ చేస్తం.
– రోజా రాణి, డీసీఎస్‌వో, యాదాద్రి జిల్లా
పెట్రోలియం నిల్వలకు ఇబ్బంది లేదు..
ఆయిల్ కంపెనీల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఆయిల్‌కంపెనీలు, డీలర్ల మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చిన సమస్య వల్లే నో స్టాక్ బోర్డులు పెడ్తున్నరు. కంపెనీలతో డీలర్ల సంఘం చర్చిస్తోంది. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. వాహనదారులు భయాందోళన చెందొద్దు.
- రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, సౌత్ ఇండియా కన్సార్టియం ఆఫ్ఇండియన్ పెట్రోలియం(సీఐపీడీ)
క్రెడిట్ ఇవ్వకనే సమస్య
బంకుల నిర్వాహకులకు ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం క్రెడిట్ సౌకర్యాన్ని తొలగించాయి. క్రెడిట్ ఇవ్వకుండా మొత్తం డబ్బులు ఒకేసారి కడితేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాయి. చాలా మంది డీలర్లు ఒకేసారి డబ్బు చెల్లించకపోవడంతో సరఫరా తగ్గుతోంది. కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నం. మా సమస్యలను వారికి వివరిస్తున్నం.
- మర్రి అమరేందర్‌రెడ్డి,
రాష్ట్ర అధ్యక్షుడు, పెట్రోల్ డీలర్ల సంఘం
