అంట్లుతోమే పీచు తయారు చేస్తే నెలకు రూ.లక్ష 24 వేలు లాభం.. విజయవాడలో ఘరానా మోసం

అంట్లుతోమే పీచు తయారు చేస్తే  నెలకు రూ.లక్ష 24 వేలు లాభం.. విజయవాడలో ఘరానా మోసం

విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. అంట్లు తోమే పీచు తయారు చేయండి.. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించండి అంటూ వందల మందికి టోకరా వేసి పరారయ్యారు కేటుగాళ్లు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం వస్తుందని నమ్మి లక్షల్లో డబ్బు సమర్పించుకున్న బాధితులు లబోదిబో అంటున్నారు. ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

కొన్ని నెలల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలో మాషా అల్లా ఎంటర్ప్రజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు పసుపులేటి అంకుశం అనే వ్యక్తి. తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి లక్షల్లో లాభం పొందండని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వంటింట్లో వాడే అంట్లు తోమే పీచు (స్కబ్బర్) ప్యాడ్ ను తయారు చేసే కాంట్రాక్టు అంటూ ఎర వేశారు. 

స్కబ్బర్ తయారీ కు అయ్యే ముడి సరుకు తామే ఇస్తామని.. ఎక్కువ ధరకు తామే కొంటామని నమ్మబలికాడు ఈ కేటుగాడు. తమది రిజిస్టర్ కంపెనీ..  ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అంటూ ఫుల్ పబ్లిసిటీ చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో మాయగాడి మాటలు నమ్మి మాషా అల్లా కంపెనీలో చాలా మంది పెట్టుబడులు పెట్టారు .

వందల మంది రూ.30 వేలు చెల్లించి మిషన్లు కొనుగోలు చేశారు. అదే విధంగా ముడి సరుకు పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు అదనంగా వసూలు చేశాడు అంకుశం. రూ.లక్ష నుంచి పది లక్షల నుంచి పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. డబ్బులు కట్టించుకొని ఫేక్ బాండ్ పేపర్లు ఇచ్చాడు.

స్క్రబ్బర్ ప్యాడ్స్ తయారు చేసి ఇస్తే నెలకు లక్ష 20 వేల రూపాయలు ఇస్తామని నమ్మించాడు. చెప్పినట్లుగానే ప్రతీ నెలా ఆదాయం పేరుతో కొంత మొత్తాన్ని ఖాతాల్లో జమచేశాడు. మొదటి 3 నెలలు సక్రమంగా చెల్లింపులు చేసి నమ్మకం కలిగించి, గత రెండు నెలలుగా స్క్రబ్బర్ తీసుకోవడం నిలిపివేశాడు. ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయిన తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. కోట్లలో డబ్బులు మూటగట్టుకుని పరాయయ్యాడు. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా పోయిందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు.