మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద మంచి ఆక్యుపెన్సీ నమోదు అవుతుంది. ఈ సందర్భంగా తాజాగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఫస్ట్ డే రూ.10.20 కోట్లకు పైగా గ్రాస్!
‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజే రూ.10.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది.
“డే1లో ప్రీమియర్స్‌తో కలిపి రూ.10.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇది వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్” అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాపై ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది.
10.20 CRORES+ GROSS for the NON-STOP ENTERTAINER #KoreanKanakaraju on Day 1 including Premieres 🤎🤎🤎
— UV Creations (@UV_Creations) August 8, 2026
ALL TIME HIGHEST OPENING GROSSER FOR @IamVarunTej 🔥🔥🔥
The entire team is Truly grateful to the audience for showering the film with such incredible love and support at the… pic.twitter.com/3QHHtRQjRn
వరుణ్ తేజ్ కెరీర్‌లో కొత్త రికార్డ్?
ఇప్పటివరకు వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రాల్లో ‘గద్దలకొండ గణేష్’, ‘F2’ ముఖ్యమైనవి. 2019లో విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ తొలి రోజు AP-TGలో సుమారు రూ.5.84 కోట్ల షేర్ సాధించి, అప్పటివరకు వరుణ్ తేజ్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచిందని ట్రేడ్ రిపోర్టులు పేర్కొన్నాయి. అదే సమయంలో ‘F2’ తొలి రోజు AP-TG షేర్ సుమారు రూ.4.96 కోట్లుగా నమోదైంది. ‘F2’ మాత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో అతిపెద్ద కమర్షియల్ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.137.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడింగ్ వెబ్సైట్ Sacnilk గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఆ తర్వాత ‘F3’ కూడా మంచి ఓపెనింగ్ సాధించింది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మల్టీస్టారర్ తొలి రోజే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.10.37 కోట్ల షేర్ సాధించినట్లు అప్పటి రిపోర్టులు వెల్లడించాయి. అయితే ‘F2’, ‘F3’ వంటి మల్టీస్టారర్ సినిమాలను పక్కన పెడితే.. సోలో హీరోగా వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ కొత్త ఓపెనింగ్ రికార్డ్ సెట్ చేసిందని మేకర్స్ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ : వీకెండ్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్..
‘మట్కా’ తర్వాత భారీ జంప్
వరుణ్ తేజ్ గత చిత్రం ‘మట్కా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. Sacnilk ప్రకారం, ఆ సినిమా తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు రూ. 0.71 కోట్లు మాత్రమే. అంతకుముందు ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలు కూడా పెద్దగా కమర్షియల్ విజయాలు అందుకోలేదు. అందువల్ల ‘మట్కా’ తర్వాత వచ్చిన ‘కొరియన్ కనకరాజు’కు తొలి రోజే వచ్చిన ఈ రెస్పాన్స్ వరుణ్ తేజ్‌కు కీలకమైన బౌన్స్‌బ్యాక్‌గా మారింది.
హారర్.. ఫాంటసీ.. కామెడీ.. మూడు కలిసిన కొత్త జానర్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’లో హారర్, ఫాంటసీ, కామెడీ అంశాలను మిక్స్ చేశారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కొరియా నుంచి వచ్చిన ఓ స్పిరిట్ కారణంగా హీరో జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు ప్రధానంగా ఉంటాయి. వరుణ్ తేజ్‌కు జోడీగా రితికా నాయక్ నటించగా.. కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించారు. ముఖ్యంగా సత్య కామెడీ, వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది.
వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్ అవుతుందా?
వరుసగా ప్రయోగాత్మక, యాక్షన్, పీరియడ్ జానర్లలో సినిమాలు చేసిన వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’తో పూర్తిగా భిన్నమైన కామెడీ, హారర్, ఫాంటసీ జానర్‌ను ఎంచుకున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ సినిమా కావడంతో కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
మొదటి రోజే మేకర్స్ ప్రకటించిన రూ.10.20 కోట్ల+ గ్రాస్ నిజమైన ట్రేడ్ ట్రెండ్‌తో ఎంతవరకు సరిపోతుందన్నది పక్కన పెడితే.. తొలి రోజు వచ్చిన స్పందన మాత్రం వరుణ్ తేజ్‌కు గట్టి బూస్ట్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఇక వీకెండ్‌లో సినిమాకు వచ్చే వసూళ్లు ఎలా ఉంటాయో, ఈ ఊపు కొనసాగిస్తే ‘కొరియన్ కనకరాజు’ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
