పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ కం బ్యాక్ మూవీగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అయితే బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా ఫర్వాలేదనిపించినా, వీక్ డేస్‌లో మాత్రం వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్న రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సునామీ ముందు ఉస్తాద్ నిలదొక్కుకోవడం సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను ప్రమోట్ చేసేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. తాజాగా ఆయన హీరోయిన్ శ్రీలీలతో కలిసి మహిళా ప్రేక్షకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఉస్తాద్'పైనే ప్రేమ ఎక్కువ!
మహిళా ప్రేక్షకులతో జరిగిన చిట్ చాట్ సెషన్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు హరీష్ శంకర్ స్పందిస్తూ.. నాకు ‘గబ్బర్ సింగ్’ అంటే ఎంత ఇష్టమో.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటే అంతకంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే గబ్బర్ సింగ్ తీసినప్పటి కంటే ఇప్పుడు నాలో ఒక పరిణతి చెందిన రచయిత కనిపిస్తున్నాడు. ప్రతి దర్శకుడు తన సినిమా సోలోగా విడుదల కావాలని కోరుకుంటాడు. కానీ ఎగ్జిబిటర్లు, నిర్మాతల నిర్ణయం మేరకు మేం సినిమాను ముందుగానే విడుదల చేయాల్సి వచ్చింది అని తెలిపారు.
‘ధురంధర్ 2’ తో పోటీ..
నిజానికి బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' లాంటి భారీ సినిమాతో పోటీ పడటం ఒక పెద్ద రిస్క్ అని హరీష్ శంకర్ అన్నారు. అది ఒక ‘మోన్‌స్టర్’ (Monster) లా బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతోంది. అయినప్పటికీ మా సినిమాపై మాకు నమ్మకం ఉంది అని పేర్కొన్నారు. భగవద్గీతలోని శ్లోకాన్ని ఉదాహరిస్తూ.. మన చేతుల్లో కేవలం ప్రయత్నం మాత్రమే ఉంటుంది, ఫలితం దైవాధీనం. సినిమాకు వస్తున్న ప్రశంసలు చూసి సంతోషిస్తున్నాను అని ఎమోషనల్ అయ్యారు.
►ALSO READ | Dhurandhar 2 Box Office: 'పుష్ప' రికార్డులు బద్దలుకొట్టిన ‘ధురంధర్’.. అల్లు అర్జున్‌ను దాటేసిన రణవీర్ సింగ్!
కలెక్షన్లు ఎందుకు తగ్గాయి?
వసూళ్ల తగ్గుదలపై హరీష్ శంకర్ చాలా ప్రాక్టికల్‌గా స్పందించారు. ప్రతి సినిమా రికార్డులు బద్దలు కొట్టాలని లేదు, ప్రతి శుక్రవారం మనదే కావాలని లేదు. మన చేతుల్లో కేవలం కంటెంట్ మాత్రమే ఉంటుంది. కానీ వసూళ్లు అనేవి రిలీజ్ విండో, టికెట్ ధరలు, పోటీలో ఉన్న ఇతర సినిమాలపై ఆధారపడి ఉంటాయి. ఉస్తాద్ గత రికార్డులను బ్రేక్ చేయకపోయి ఉండొచ్చు, కానీ సినిమా అందించే సందేశం ప్రేక్షకులకు చేరుతుందనే నమ్మకం ఉంది అని వివరించారు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ. 85 కోట్లు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు కోలుకుంటుందో చూడాలి.
