క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదు.. అలాంటప్పుడు మతం మారిన వాళ్లకు ఎస్సీ, ఎస్టీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మాత మార్పిడి అనంతరం అట్రాసిటీ చట్టం కింద కేసులపై విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ కీలకమైన తీర్పు ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారి.. పాస్టర్ గా పని చేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ NV అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం.
సుప్రీం కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు:
- ఎస్సీ ఎస్టీ హోదాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు
- క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి SC&ST చట్టం కింద రక్షణ పొందలేరు
- కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదు
- రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు తప్ప మరే మతంలో ఉన్నవారూ SC సభ్యులు కాలేరు
- మతం మార్చుకున్న వెంటనే SC హోదా రద్దవుతుంది
- పుట్టుక ఆధారంగా కాదు, మతం ఆధారంగా హోదా
- కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా SC&ST చట్టం వర్తించదు
- సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని చెప్పలేం
- పాస్టర్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారు, తిరిగి మారలేదు
- SC కమ్యూనిటీలోకి తిరిగి చేర్చుకున్నారని నిరూపించుకుంటేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యం
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పులో ఏముంది..?
క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదాపై సుప్రీం కోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. గతంలో ఈ అంశంపై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పు ఈ కింది విధంగా ఉంది.
క్రైస్తవంలోకి మారిన తక్షణమే ఆ హోదా కోల్పోతారని, వారు ఎస్పీ,ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద రక్షణ పొందలేరని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతానికి కుల వ్యవస్ధ దూరమని పేర్కొంది. చర్చిలో పాస్టర్‌గా సేవలు అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్లపై పోలీసులు ఎస్సీఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది.
ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు క్రైస్తవ మతంలోకి మారి గత పదేళ్లుగా తాను పాస్టర్‌గా సేవలు అందిస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నారని గుర్తు చేసింది. అధికారులు కుల ధ్రువీకరణపత్రం ఇచ్చారనే కారణం చూపి మతం మారిన ఫిర్యాదుదారు ఆ చట్టం కింద రక్షణ పొందలేరని తెలిపింది. ఫిర్యాదుదారు చట్టాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడింది. ఈ క్రమంలో పిటిషనర్ల పై ఎస్సీ,ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని ప్రకటించింది.
