కుషాయిగూడలో వైద్యం కోసం ఆసుపత్రిని ఆశ్రయించిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం, చికిత్సలో లోపాలే మృతికి కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగాటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బొల్ల రవి (40) అనారోగ్యంతో చికిత్స కోసం ఈసీఐఎల్ ఆక్సీకేర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ రవి ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమిస్తున్న విషయం చెప్పకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యం ఆరోగ్యం క్షీణించిన విషయం చెప్పకుండా వైద్యం చేస్తున్నట్లు నమ్మించి మోసం చేసినట్లు ఆరోపిస్తున్నారు.
ఆరోగ్యం మరింత క్షీణించడంతో రవిని ఆసుపత్రి యాజమాన్యం మరో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ చికిత్స కొనసాగించినప్పటికీ రవి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ALSO READ : తెలంగాణకు నష్టం చేసే అంశాలు తొలగించండి..
దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బాధితులు ఈసీఐఎల్ ఆక్సీకేర్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంతో వ్యక్తి మృతికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
