- ఏపీ ఎజెండా అంశాలు తొలగించేలా గోదావరి బోర్డును ఆదేశించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీటి హక్కులను కాలరాసేలా ఉన్న అంశాలను గోదావరి బోర్డు మీటింగ్ ఎజెండా నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎజెండాను తొలగించేలా వెంటనే బోర్డును ఆదేశించాలని కోరుతూ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు ఆయన లేఖ రాశారు.
తెలంగాణలోని పలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన చట్టబద్ధమైన అనుమతులను మళ్లీ సమీక్షించేలా ఎజెండాను రూపొందించారన్నారు. ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అత్యున్నత సంస్థల అధికారాలు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు.
కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి, ముక్తేశ్వరం, చనాక-కొరట, మోడికుంటవాగు, కడెం-గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాతే అనుమతులు వచ్చాయని, ఇప్పుడు వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో పెట్టడం సరికాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా పర్మిషన్లు ఇచ్చిన తర్వాత, ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించడం లేదా రద్దు చేసే అధికారం గోదావరి బోర్డు లాంటి కింది స్థాయి సంస్థకు ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు.
మిషన్ భగీరథ గొప్ప ఆలోచన..
గొప్ప ఆలోచనతో ప్రారంభించిన మిషన్ భగీరథతో ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికిందని హరీశ్ రావు అన్నారు. మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ అనేది ఒక పథకం కాదు.. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన ఒక మహోత్తరమైన ప్రణాళిక అని పేర్కొన్నారు.
గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని శుద్ధి చేసి, భారీ పైప్‌లైన్ల ద్వారా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు తరలించి.. ఇంటింటికీ సరఫరా చేసే సమగ్ర తాగునీటి వ్యవస్థను కేసీఆర్ నిర్మించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, దెబ్బతిన్న పైప్‌లైన్లు, పంపింగ్ వ్యవస్థలను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
