ఖిలా వరంగల్ (కరీమాబాద్), వెలుగు : యూరియా, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఖిలా వరంగల్ ప్రాంత రైతులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ యూరియా బుకింగ్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో సమయానికి యూరియాను బుక్ చేసుకోలేకపోతున్నామని తెలిపారు.
వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేదని, రైతులకు సరైన సమయాల్లో కరెంట్ అందకపోవడంతో పంటలకు నీరు పెట్టడం, సాగు పనులు నిర్వహించడం కష్టంగా మారిందన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో ఆకుకూరల పంటలు సాగు చేస్తున్నామని, దాదాపు 1000 రైతు కుటుంబాలు ఈ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
