ప్రస్తుతం టెక్నాలజీ మానవుని జీవితాన్ని దాదాపుగా ఆక్రమించేసింది. ముఖ్యంగా సెల్ ఫోన్‌లు లేనిదే మనిషి నిద్రలేవడం లేదు.. అలాగే నిద్రపోవడం లేదు. ఆఖరికి టాయిలెట్స్‌లోకి కూడా ఫోన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. అలాంటిది దేవాలయాలలోకి తీసుకెళ్లడం ఒక లెక్కా..? అయితే దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లపై బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ( BKTC ) నిషేధం విధించింది. ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాల్లో ఈ నిబంధన అమలులో ఉంది. దేవాలయం ప్రాంగణంలో సెల్ ఫోన్లు, హ్యాండ్ కెమెరాలను భద్రపరిచే క్లోక్ రూం ఉంటుంది. భక్తులు ఆ క్లోక్ రూంలో ఇచ్చి ... దర్శనం అనంతరం తీసుకొని వెళతారు.
ఇటీవల కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఒక యువతి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దానిని వారి యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది పోలీసులను కోరారు. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆవీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా భక్తులు, ఆధ్యాత్మిక సంఘాల నుంచి బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ( BKTC ) పలు విమర్శలను ఎదుర్కొంది. ప్రార్థనా స్థలంలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని BKTC చీఫ్ అజేంద్ర అజయ్ సూచించారు.
సోషల్ మీడియా అధినేతలు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే ఈ కేదార్ నాథ్ ఆలయంలో లవ్ ప్రపోజల్ చేసిన వీడియో వైరల్ కాగా బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ( BKTC ) ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్లు, హ్యాండ్ కెమేరాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి ఆలయం ఉన్నట్లే ఇక్కడ కూడా భక్తుల మొబైల్ హ్యాండ్‌సెట్‌లను భద్ర పరుచుకొనేందుకు క్లోక్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని వారు యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే కేదార్‌నాథ్‌లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని తనిఖీ చేసే పద్దతిని ప్రవేశపెట్టి ప్రయత్నించారని కాని అది విఫలమైందని ఆలయాధికారులు తెలిపారు. ఈ చర్య ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని అధికారులు పేర్కొన్నారు.
