ఇంకుడు గుంత ఉంటేనే  నీళ్ల కనెక్షన్..విలీన ప్రాంతాల్లోవాటర్బోర్డు కొత్త రూల్

ఇంకుడు గుంత ఉంటేనే  నీళ్ల కనెక్షన్..విలీన ప్రాంతాల్లోవాటర్బోర్డు కొత్త రూల్
  • ఇప్పటికే కనెక్షన్ల కోసం 
  • భారీగా దరఖాస్తులు 200 చ.గజాల్లో ఇల్లుంటే 
  •  తప్పనిసరి నిర్మించుకోవాల్సిందే  

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  హైదరాబాద్​ ఔటర్ పరిధిలోని విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్ కనెక్షన్లు ఇవ్వడానికి వాటర్ బోర్డు కొత్త నిబంధన విధించింది. 200 చ.గజాల్లో ఇల్లు కట్టుకున్నవారు తప్పని సరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాల్సిందేనంటున్నారు. గ్రేటర్​లో వాటర్​బోర్డుకు ఇంతకుముందు 1450 చ. కి.మీ. పరిధి ఉండగా, ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలను విలీనం చేయడంతో మరో 603 చ. కి.మీ.కు పెరిగింది.

దీంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకూ నల్లా కనెక్షన్లు లేనివారు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. నెలకు 2 వేలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో నీళ్ల సరఫరా సాధ్యాసాధ్యాలు పరిశీలించింది. అక్కడి గ్రౌండ్​వాటర్​లెవెల్స్​తెలుసుకోగా భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు తెలిసింది. దీంతో వచ్చే వర్షాకాలానికి భూగర్భ నీటి నిల్వలు పెంచేందుకు తప్పనిసరి ఇంకుడు గుంతల నిబంధన తీసుకువచ్చింది. అయితే, 200 చ.గజాల్లో ఉన్న ఇండ్లకే ఈ రూల్​వర్తిస్తుందని స్పష్టం చేశారు.  

3 నెలల్లో18 వేల ఇంకుడు గుంతలు..

విలీన ప్రాంతాల్లో 90 రోజుల్లో18 వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అధికారులు టార్గెట్​పెట్టుకున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ నుంచి ఓఆర్ఆర్ వరకు నోడల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. వీరు ఒక్కొక్కరు వారి పరిధిలో 2 వేల ఇంకుడు గుంతలు నిర్మాణమయ్యేలా ప్లాన్లు రూపొందించుకోవాలని బోర్డు ఎండీ అశోక్​రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సింగిల్​విండో సెల్​కు వచ్చే అప్లికేషన్లను పరిశీలించి వారి ఇండ్లకు వెళ్లి ఇంకుడు గుంత ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఇంకుడుగుంత లేకపోతే వారికి నల్లా కనెక్షన్​ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఇలా మూడు నెలల్లో లక్ష్యాన్ని చేరాలని ఎండీ ఆదేశించారు.