పదేండ్ల కింద కట్టిన రిజర్వాయర్లను ఎందుకు వాడట్లే: వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

పదేండ్ల కింద కట్టిన రిజర్వాయర్లను ఎందుకు వాడట్లే: వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: కోర్ సిటీలో మురుగు నీటి వ్యవస్థ ఆధునికీకరణ కోసం చేపట్టిన జోన్-–3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్ తో కలిసి సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న పనుల్ని మంగళవారం ఆయన పరిశీలించారు. 

టోలిచౌకి ఫ్లైఓవర్ మెయిన్​రోడ్డుపై 8 నుంచి 11 మీటర్ల లోతులో జరిగే టన్నెలింగ్ పనులను ఆటంకాలు కాకుండా ఎలా చేపట్టాలో చర్చించారు. సెవెన్​టూంబ్స్​వెళ్లే దారిలో చేపట్టే అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులను ఇండ్లకు నష్టం కలగకుండా ఎలా చేయాలో ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 

అంతకుముందు షేక్ పేట్ వాటర్​బోర్డు ఆఫీసుకు వెళ్లిన ఆయన.. పదేండ్ల క్రితం నిర్మించిన 10 మిలియన్​లీటర్ల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లను ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే వినియోగంలోకి తీసుకుని, ఏయో ప్రాంతాల్లో నీటి సరఫరా చేయవచ్చో సర్వేచేసి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్రెడ్డి, సీజీఎంలు వినోద్ భార్గవ, రాజేందర్, జీఎంలు శ్రీను నాయక్, కుమార్ పాల్గొన్నారు.