ప్రజలను కాపాడే హోం మినిస్టర్ మాకు కావాలి

ప్రజలను కాపాడే హోం మినిస్టర్ మాకు కావాలి

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుపాయల వనదుర్గ మాత ఆశీస్సులు తీసుకున్నా.. అమ్మవారి ఆశీర్వాదం తో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతానని అన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఘనపూర్ ఆనకట్టకు 100 కోట్లు కేటాయించిన అని కేసీఆర్ అన్నారని..ఎక్కడా ఆ 100 కోట్లు అని ప్రశ్నించారు. రైతులకు దొడ్డు వడ్లు వేయవద్దు అన్నాడు... కానీ సీఎం మాత్రం దొడ్డు వడ్లు పండించాడన్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ అన్నాడు, రైతులకు యూరియా ఫ్రీ అన్నాడు... ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాదు.. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పనికిమాలిన స్కీమ్ అన్న కేసీఆర్.. ఆరోగ్య శ్రీలో కరోనాను  ఎందుకు చేర్చలేదని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు.

రైతు పండించిన ప్రతి గింజలను నేనే కొంటానని...కేంద్రం తో సంభంధం లేదన్న కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయడంలేదంటూ.. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడని విమర్శించారు బండి సంజయ్. మంచి అయితే నేను చేసిన అంటాడు.. చెడు అయితే కేంద్రం చేసింది అంటాడు అని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేంద్రం 10 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తే.. ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా పేద ప్రజలకు ఇవ్వ లేదని అన్నారు. బీజేపీ పేద ప్రజల కొరకు పని చేసే ప్రభుత్వమని...తెలంగాణ ప్రజలకు 3 లక్షల ఇండ్లు కేంద్రం ఇస్తే కేవలం 12 వేల ఇండ్లు మాత్రమే కేసీఆర్ ఇచ్చాడన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 2023 ఎన్నికలకు ముందు TRS కార్యకర్తలకు ఇచ్చి ఓట్లు వేయించుకునే పథకం ప్రారంభిస్తాడని ఆరోపించారు. తాలు, తరుగు పేరుతో రైతులను.. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 

ప్రస్తత  హోం మినిస్టర్ కేసీఆర్ ఇంటికి కాపలా కాసే కుక్క మాత్రమేనన్న బండి సంజ్...ప్రజలను కాపాడే హోం మినిస్టర్ మాకు కావాలన్నారు. చిన్నారుల పై లైంగిక దాడుల జరుగుతుంటే హోం మినిస్టర్ ఏం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీ గురించి ఆలోచించే హోం మినిస్టర్ మాకు వద్దని..యావత్ తెలంగాణ గురించి ఆలోచించే హోం మినిస్టర్ కావాలన్నారు.

పేదవారు చనిపోతే కేసీఆర్ స్పందించడని అన్న బండి..గడీల పాలనను బద్దలు కొట్టడానికి, మూర్ఖుల పాలన నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడటానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర అని అన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల న్నింటికి కేంద్రం నిధులు ఇస్తుంటే..కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నాడంటూ విమర్శించారు.ముస్లిం సోదరీమణుల కు న్యాయం చేయాలని ట్రిపుల్ తలక్ పై చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం. ట్రిపుల్ తలాక్ ఉంచమంటావా, తేసేయమంటావా కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.