రైతులు చేస్తున్న ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు

రైతులు చేస్తున్న ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు

కరీంనగర్ : “ఈ దేశంలో ఇద్దరే ఇద్దరు త్యాగ మూర్తులు.. ఒకరు జై జవాన్, మరొకరు జై కిసాన్.. అలాంటి త్యాగమూర్తుల సమస్యలని భేషజాలకు పోకుండా తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నామని” అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఎద్దు ఏడిస్తే వ్యవసాయం.. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని ఆయ‌న అన్నారు. ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో నెల రోజుల పాటు రైతులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామ‌ని చెప్పారు. సోమ‌వారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయతో క‌ల‌సి రైతువేదికను ప్రారంభించారు మంత్రి ఈటల.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు మా ఆలోచన, మా పథకాలు వ్యవసాయం చుట్టూ రైతుల చుట్టూ అల్లుకుని ఉన్నాయన్నారు. వ్యవసాయం బాగుంటేనే పల్లెలు బాగుంటాయని, పల్లెలు బాగుంటేనే బంగారు తెలంగాణ ఏర్పడుతుందని నమ్మాను కాబట్టే అందుకోసం ఆరాటపడుతున్నాన‌ని చెప్పారు. MSP ధర పెట్టి ఐకేపీ సెంటర్ల ద్వారా వరి మొక్కజొన్న ఏ విధంగా కొనుగోలు చేశామో రానున్న రోజులలో కూడా అదే విధంగా కొనుగోలు చేస్తామ‌ని అన్నారు.