మానేరు రివర్ ప్రంట్ ప్రాజెక్టు కోసం 410 కోట్లు

మానేరు రివర్ ప్రంట్ ప్రాజెక్టు కోసం 410 కోట్లు
  • అర్కిటెక్చరల్, ఇంజనీరింగ్ డిజైన్ల పనులకోసం టెండర్లు పిలిచాం
  • జూలై నెలాఖరు కల్లా డీపీఆర్, ఆగస్టు నుండి పనులు ప్రారంభించేలా చర్యలు
  • మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: కరీంనగర్ ముఖద్యారమైన లోయర్ మానెర్ డాం రూపురేఖలు మారబోతున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అధ్బుతమైన రివర్ ప్రంట్ గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మానేర్ రివర్ ప్రంట్ ప్రాజెక్టు పురోగతిపై మంగళవారం జలసౌదలో టూరిజం, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పాటు సర్వేసంస్థ ప్రతినిధులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రూ.410 కోట్లతో మానేరు రివర్ ప్రంట్ రూపు రేఖలు మార్చేయబోతున్నామని.. ఆర్కిటెక్చరల్, ఇంజనీరింగ్ డిజైన్ల పనులకోసం టెండర్లు పిలిచామని.. జూలై నెలాఖరు కల్లా డీపీఆర్, ఆగస్టు నుండి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మెదటి విడత 4కిలోమీటర్లు ప్రాజెక్టుకోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కరీంనగర్ పట్టణం ఆనుకొని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అత్యద్బుతమైన వాటర్ బాడీని అధ్బుత రివర్ ప్రంట్ గా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. కాళేశ్వరం ద్వారా లోయర్ మానేరు అన్ని కాలాల్లోనూ పుష్కలంగా నీటితో నిండటం వల్ల మానేరు రివర్ పంట్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటికే రెవెన్యూ సర్వే పూర్తయిందని ప్రభుత్వ భూముల భూసెకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు మంత్రి గంగుల.

 ఏకాం ప్రతినిధులు తాము చేస్తున్న సర్వే పురోగతిని మంత్రికి వివరించారు 1.8 కిలోమీటర్ల మేర డిజిటల్ సర్వే పూర్తయిందన్నారు, ఈ సందర్భంగా జూలై నెలాఖరుకల్లా ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ తో పాటు డీపీఆర్ ని పూర్తి చేస్తామని, ఆగస్టులో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఇతర సివిల్ వర్కులకు టెండర్లు పిలిచి సంవత్సరం లోపల ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు, గతంలో 5లక్షలకు పైగా క్యూసెక్కుల ప్లో వచ్చిందని మిడ్ మానేర్ నిర్మించిన తర్వాత వచ్చే ప్లో తగ్గిందని భవిష్యత్లో వచ్చే వరదను అంచనా వేసి నిర్మాణాలను తీర్చిదిద్దాలని సూచించారు. 
నీటి పారుదల, వరదల నివేదికల ప్రకారం గత ఐదువందల ఏండ్ల వరద రిపోర్ట్ ఆధారంగా గరిష్ట వరదను తట్టుకునే విధంగా నిర్మాణాలను రూపొందిస్తామని ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. బోటింగ్ కు అనుగుణంగా రివర్ ప్రంట్ రూపొందించడంతో పాటు ప్రపంచ స్థాయి అమ్యూజ్ మెంట్ పార్క్, వాటర్ స్పోర్ట్స్, లేజర్ షో, వాటర్ లైటింగ్, ఇతర ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని టూరిజం అధికారులు మంత్రి గంగుల కమలాకర్ కి వివరించారు.

మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇవికాకుండా రూ.80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు చివరి ధశల్లో ఉన్నాయి. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లతో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుకు సంబందించి అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. అనంతరం మానేరు రివర్ ఫ్రంటు నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ సైతం జారీ అయింది. 

ఈ సమావేశంలో ఇరిగేషన్, కాడ్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్ రావు, శంకర్, టూరిజం కార్పోరేషన్ ఎండి మనోహర్ రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగబూషణం, ఏకాం ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.