అబిడ్స్, వెలుగు: రెవెన్యూ శాఖలో టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నాంపల్లిలోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్ జేఏసీ చైర్మన్, అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకృష్ణరెడ్డి, టీసీవోల రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 632 మంది టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు.
ఉద్యోగాలు కోల్పోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఈ వయస్సులో ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సీసీఎల్ఏ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో భూమేశ్, సీతమ్మ, అంజద్, సునీల్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
