V6 News

మహిళా రిజర్వేషన్ల ముసుగులో తెచ్చే బిల్లులను తిరస్కరిస్తం: కాంగ్రెస్

మహిళా రిజర్వేషన్ల ముసుగులో తెచ్చే బిల్లులను తిరస్కరిస్తం: కాంగ్రెస్
  • వాటి అసలు ఉద్దేశం దురుద్దేశపూరితమైనది: కాంగ్రెస్
  • పార్లమెంట్‌‌ను హైజాక్ చేయాలన్ని కేంద్రం ప్రయత్నాన్ని అడ్డుకుంటం: ఖర్గే
  • ప్రజాస్వామ్యంపై  దాడిని పూర్తి శక్తితో ఎదుర్కొంటామని వెల్లడి
  • ఆ రెండు బిల్లులకు ముడిపెట్టడం వెనుక భారీ కుట్ర!
  • బీజేపీ సర్కారు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నది: మమత

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసే ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుల అసలు ఉద్దేశం దురుద్దేశపూరితమైనదని కాంగ్రెస్​ఆరోపించింది. వాటిని ప్రస్తుత రూపంలో పూర్తిగా తిరస్కరించాలని పేర్కొంది. గురువారం పార్లమెంట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌‌లోని కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు ఖర్గే చాంబర్‌‌లో ఇండియా బ్లాక్ నాయకులు సమావేశమయ్యారు. 

ఈ సమావేశానికి ఖర్గేతో పాటు లోక్‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, ఎన్‌‌సీపీ(ఎస్‌‌పీ)కి చెందిన సుప్రియా సూలే, డీఎంకేకి చెందిన టీఆర్ బాలు, టీఎంసీకి చెందిన సాగరిక ఘోష్, సీపీఎంకు చెందిన జాన్ బ్రిట్టాస్, ఆర్‌‌ఎస్‌‌పీకి చెందిన ఎన్ కే ప్రేమ్‌‌చంద్రన్ తదితరులు హాజరయ్యారు. 

సమావేశం అనంతరం ఖర్గే.. మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఉన్న లోపభూయిష్టమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులతో పార్లమెంట్‌‌ను హైజాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షం అనుమతించదని అన్నారు. ‘‘మేము ఐక్యంగా నిలబడతాం. మన ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ కుటిల దాడిని మన పూర్తి శక్తితో ఎదుర్కొంటాం’’ అని ఎక్స్​లో పోస్ట్​చేశారు. 

లోక్‌‌సభలో కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది: జైరాం రమేశ్

లోక్‌‌సభలో ప్రవేశపెడుతున్న ఈ మూడు బిల్లులను ప్యాకేజింగ్, మార్కెటింగ్ పరంగా ‘మహిళా రిజర్వేషన్’ అని చూపిస్తున్నారని.. కానీ, వీటి ప్రాథమిక ఉద్దేశం మాత్రం డీలిమిటేషన్​తో ముడిపడి ఉందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌‌చార్జ్ జైరామ్ రమేశ్​ పేర్కొన్నారు. దీనివల్ల కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్‌‌సభలో తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉన్న కొన్ని అధిక జనాభా గల రాష్ట్రాలకు ప్రాధాన్యతనిచ్చే డీలిమిటేషన్ ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయని ఆయన ఎక్స్​లో పేర్కొన్నారు.

 ‘ఈ బిల్లుల అసలు ఉద్దేశం దురుద్దేశపూరితమైనది. వాటిలోని అంశాలు మోసపూరితమైనవి. వాటి వల్ల కలిగే నష్టం అపారమైనది. వాటిని ప్రస్తుత రూపంలో పూర్తిగా తిరస్కరించాలి’ అని జైరాం ​స్పష్టం చేశారు. ప్రతిపక్షం డిమాండ్ చాలా క్లియర్​గా ఉందని.. లోక్‌‌సభలోని ప్రస్తుత 543 స్థానాలలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్​చేశారు.