రానున్న 4 రోజులు వానలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్​ జారీ

రానున్న 4 రోజులు వానలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజు ల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్​, విదర్భ, మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్నాటక, కేరళ మీదుగా ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. 

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​ మల్కాజ్‌‌గిరి, వికారాబాద్, మహబూబ్‌‌నగర్, నాగర్‌‌‌‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు అలర్ట్‌‌ జారీ చేసింది. 

హైదరాబాద్​ సిటీలో నాలుగు రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మినహా, టెంపరేచర్లు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

పలు జిల్లాల్లో వర్షం

రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నాగర్​కర్నూల్, నల్గొండ, యాదాద్రి, మహబూబాబాద్, వరంగల్, హను మకొండ, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఎండ..

రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్​ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీ ల టెంపరేచర్‌‌‌‌ నమోదైంది. జగిత్యాల జిల్లా గోధూరులో 44.4, నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్‌‌ లో 44.3, నిజామాబాద్​ జిల్లా మెండోరాలో 44.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.