కరోనా కష్టాలు : 15 రోజుల్లో పెళ్లి..15 రోజులు ట్రీట్ మెంట్

కరోనా కష్టాలు : 15 రోజుల్లో పెళ్లి..15 రోజులు ట్రీట్ మెంట్

కరోనా వైరస్ భయాందోళనల మధ్య చైనా, జపాన్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులు గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరందరికి మానేసర్ లో కరోనా  పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్స్. మరోవైపు చైనాలో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనా వుహాన్ లో చిక్కుకుపోయిన 76 మంది ఇండియన్స్ ఢిల్లీకి చేరుకున్నారు. భారతీయులతో పాటు మరో 7 దేశాలకు చెందిన 36 మంది ప్రయాణికులను తీసుకుని ఎయిర్ ఫోర్స్ విమానం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టు లో ల్యాండ్ అయింది. వీరితో పాటు కర్నూలుకు చెందిన జ్యోతి కూడా ఢిల్లీ  చేరుకున్నారు. కొద్ది రోజుల క్రితమే జ్యోతి భారత్ రావాల్సి ఉన్నా… జ్వరంతో బాధపడుతున్న జ్యోతిని తీసుకువచ్చేందుకు ఫ్లైట్ సిబ్బంది నిరాకరించారు.

మార్చి 14న జ్యోతి వివాహం జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత జ్యోతి ఢిల్లీ చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఇది తీపి కబురే. టీసీఎల్‌ కంపెనీ శిక్షణ కోసం చైనాలోని వూహాన్‌ నగరానికి వెళ్లిన జ్యోతి కరోనా కల్లోలం నేపథ్యంలో అక్కడ చిక్కుకుని తీవ్రంగా ఇబ్బంది పడిన ఆమె ఎట్టకేలకు ఢిల్లీ కి చెయుకున్నట్లు సమాచారం. భారత్‌ పంపిన రెండు ప్రత్యేక విమానాలు వచ్చిన సమయానికి ఆమెకు జ్వరం ఉండటంతో అక్కడి అధికారులు ఆమెను స్వదేశానికి పంపేందుకు అంగీకరించక పోవడంతో తీవ్ర భయాందోళన కు గురిచేసింది.

దీంతో ఆమెతోపాటు వెళ్లిన వారు వచ్చినా ఆమె రాకపోవడం, ఆమెకు పెళ్లి కూడా నిశ్చయం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. జ్యోతిని స్వదేశానికి రప్పించేందుకు సాయపడాలంటూ.. కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు, ఎంబసీ అధికారులకు చాలాసార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు.. ఎట్టకేలకు వారి ఎదురు చూపు ఫలించింది. గురువారం ఉదయం చైనా నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న జ్యోతిని .. అక్కడే పదిహేను రోజులపాటు ఉంచనున్నారు. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) సోకలేదని నిర్ధారణ అయితే కర్నూలు పంపేందుకు అంగీకరిస్తారు.