V6 News

Vastu: వాస్తు దోషం ఏర్పడేందుకు  కారణాలుఏంటి..! స్థలం.. ప్లాట్ కొనే ముందు తెలుసుకోవలసినవి ఇవే..!

Vastu: వాస్తు దోషం ఏర్పడేందుకు  కారణాలుఏంటి..! స్థలం.. ప్లాట్ కొనే ముందు తెలుసుకోవలసినవి ఇవే..!

చిన్న ఆరోగ్యసమస్య వచ్చినా.. ఆర్ధిక సమస్యలు వచ్చినా.. ఉద్యోగం...కష్టాలు ఇలా ఏది వచ్చినా వెంటనే జ్యోతిష్య పండితులను.. వాస్తు పండితులను సంప్రదిస్తాం.  వాస్తుశాస్త్రం ప్రకారం... ఇల్లు కట్టిన తరువాత కాదు.. ఇంటి స్థలం కొనే విషయంలో కూడా చాలా వాస్తు నియమాలున్నాయి. ఇదంతా ఏమీ పట్టించుకోకుండా అందిన ధరకు వస్తుంది కదా  అని ప్లాట్.. ఇంటి స్థలం కొంటారు..

మనలో చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు పండితులను సంప్రదిస్తారు.   అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

మొదటిది ఇంటి స్థలాన్ని కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి.  ఎందుకంటే లూజ్ సాయిల్  అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు.  కట్టడం బలంగా వుండదు.  అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన వున్న ప్రదేశాలలో కూడ ఇల్లు కడితే సుఖంగా వుండలేరని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే చుట్టుపక్కల ఎలా వుంది.  చెరువులు.. గుట్టలు ఉన్నాయి.. అవి మనం తీసుకొనే స్థలానికి ఎటువైపున ఉన్నాయి.  ఇరుగూ, పొరుగూ ఏమేమి ఉన్నాయి.. మొదలటు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ముందుగానే వాస్తు పండితులను సంప్రదించి నిర్ణయానికి రావాలని వాస్తు పండితులు అంటున్నారు.  

రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలి వగైరాలన్నీ ముందే వాస్తు పండితులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.  

ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు.  దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది.  ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం వుంటుందంటారు. 

జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, ,  బాధపడే ఇంట్లో వాస్తు దోషం వున్నట్లే.  అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు వుండవు.  సర్ప, దేవతా, ఋషి శాపాలు వున్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం వున్నట్లేనని వాస్తు శాస్త్రంద్వారా తెలుస్తుంది.

ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలుకాదు.  మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు.  అలాగే కొందరు ఇల్లు కట్టాక వాస్తుకోసమని కొంత భాగం పడగొట్టి మార్పులు చేర్పులు చేస్తూవుంటారు.  అలా చెయ్యటంకూడా వాస్తుదోషమేనని వాస్తు పండితులు చెబుతున్నారు.

భూమిలోను, ఇంట్లోను దోషాలుంటే ఆ ఇంటిని మారిస్తే సరిపోతుంది.  మన ప్రవర్తనలో దోషం వుంటే మనం ఏ ఇంటికెళ్ళినా ఆ ప్రవర్తన మారకపోతే తిప్పలు తప్పవు.  ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లయినా కలసిరాదు.  అందుకే ముఖ్యంగా మన ప్రవర్తనని సరి చేసుకోవాలి.  అప్పుడు ఏ ఇంట్లోనైనా సంతోషంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని వాస్తు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.