హైదరాబాద్, వెలుగు: పంట బోనస్ కు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించారా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఏ రకం ధాన్యం వేయాలో సర్కారు నిర్ణయించడం అంటే రైతన్న మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమేనన్నారు. “మేనిఫెస్టోలో అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ అని, తర్వాత 33 రకాల సన్నాలకు పరిమితం చేశారు.
ఇప్పుడు దాన్ని 7 రకాలకు తగ్గించారు. మీరు చెప్పిన 7 రకాల పంటలకే బోనస్ ఇస్తాం అంటే, ఇప్పటికే నారు వేసిన రైతుల పరిస్థితి ఏమిటి? రైతులంటే ఈ ప్రభుత్వానికీ ఎందుకు అంత కోపం? రైతు బంధు, పంట బోనస్, పంట బీమా, రైతు బీమా గురించి సమీక్ష చేయకపోవడం అంటే రైతు సంక్షేమాన్ని విస్మరించడమే. గత మూడు సీజన్లకు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగికి రెండు ఎకరాలకు రైతుభరోసా ఇచ్చి చేతులు దులుపుకుంది. 45 రోజుల్లో ఇస్తామని సిద్దిపేట వేదికగా సీఎం చెప్పి 85 రోజులు దాటింది.
ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకే దిక్కులేకుండా పోయింది. ఎన్నికలు లేకుంటే రైతు భరోసా ఇవ్వరా? ఎరువుల సరఫరా చేయలేక యాప్ తెచ్చిన మీ ప్రభుత్వం అందులోనూ విఫలం అయింది. ఇప్పుడు ఎరువులు, విత్తనాలు రైతువేదికల ద్వారా సరఫరా చేయలాని చెబుతున్నరు. సీజన్ కు ఒకరకంగా వ్యవహరిస్తూ రైతులను ఎందుకు గందరగోళం చేస్తున్నారు? పంట బీమా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్ లో చెప్పి రెండేండ్లయినా అమలు చేయకపోవడం దుర్మార్గం” అని ఆయన విమర్శించారు.
