భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలను వెంబడించి తరిమికొట్టాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం పాక్‌లో కూలిపోయింది. అందులో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ అభినందన్ పాక్ సైన్యం చేతికి చిక్కారు. ఆయన పై పాక్ తీవ్రంగా దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో భారత్ సహా విపక్షాలు జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించవద్దని సూచిస్తున్నాయి. భారత పైలట్ పాక్ కు పట్టుపడటంతో… జెనీవా ఒప్పందం ఏమిటనే చర్చ సాగుతోంది. జెనీవా అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ మన సైనికుడిని తమ అదీనంలోకి తీసుకుంటే వారం రోజుల్లో తిరిగి అప్పగించారు. లేదంటే రెండు దేశాలు అధికారికంగా యుద్ధానికి రెడీ అవుతున్నట్లే అవుతుంది.
యుద్ధంలో పట్టుబడిన సైనికులు, ప్రజలతో ఎలా వ్యవహరించాలనేది జెనీవా ఒప్పందం చెబుతుంది. యుద్ధ ఖైదీల హక్కులపై జెనీవా సమావేశం నిర్వచించింది. యుద్ధ సమయంలో గాయపడిన,అనారోగ్యంతో పట్టుబడిన సైన్యం, ప్రజల పట్ల ఎలా ఉండాలో ఇందులో తెలిపారు. జెనీవా ఒప్పందంలో నాలుగు అంశాలు ఉన్నాయి. 1949లో మూడు సవరణలతో రూపొందించారు.
మొదటి ఒప్పందం ప్రకారం.. గాయాలతో పట్టుబడిన, అనారోగ్యంతో ఉన్న సైనికులకు సంబంధించినది. రంగు, ఆడ-మగ, మతం, ఏ ప్రాంతం వారు, ధనం.. ఇలా ఏ ఇతర ఆధారాలతో వారిని వేధించరాదు. వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. ఎలాంటి విచారణ లేకుండా యుద్ధంలో పట్టుబడిన వారిని వేధించవద్దు, హింసించవద్దు, ఉరి తీయవద్దు. అనారోగ్యంతో ఉన్నవారికి సరైన వైద్య చికిత్స అందించాలి. పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి.
జెనీవా రెండో ఒప్పందం నౌకాదళానికి, ఇతర నేవీ దళాలకు వర్తిస్తుంది. ఇక మూడో ఒప్పందం ప్రకారం.. యుద్ధంలో పట్టుబడిన ఖైదీ గురించి చెబుతుంది. వీరికి కూడా మొదటి ఒప్పందానికి సంబంధించినవే వర్తిస్తాయి. పట్టుబడిన వారి పేర్లు, ర్యాంకులు, సీరియల్ నెంబర్లు మాత్రమే… వారు తీసుకోవాలి. అంతే తప్ప, ఆ దేశం గురించి ఇతర సమాచారం తెలుసుకునేందుకు పట్టుబడిన వ్యక్తిని హింసించవద్దు. నాలుగో ఒప్పందం ప్రకారం.. గాయపడిన, అనారోగ్యం పాలైన సైనికులు, పట్టుబడిన ప్రజల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి, రక్షణ కల్పించాలని చెబుతోంది.
