భద్రాద్రికి ఇస్తామన్న వంద కోట్లు ఏవి ?

భద్రాద్రికి ఇస్తామన్న వంద కోట్లు ఏవి ?

భద్రాచలంలోని సీతారామ దేవాలయాన్ని రూ.వంద కోట్లతో అభివృద్ధి  చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్, ఇప్పుడెందుకు నిధులివ్వడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 88వ రోజు బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   ఆర్టీసీ చార్జీలను  పెంచడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు.  సీఎం  కేసీఆర్ మాత్రం వ్యక్తిగత ప్రయాణ అవసరాల కోసం కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును వాడుకుంటున్నారని పేర్కొన్నారు.  ఆ భారం మొత్తాన్ని పేదలపై మోపుతున్నారని విమర్శించారు.  

ఉద్యోగార్ధులను మోసం చేసే కుట్ర..

భద్రాచలం నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్  అయినా సరే..  గత కొన్నేళ్లుగా గిరిజనులకు ఎలాంటి న్యాయమూ జరగలేదన్నారు. ఇదే ఏజెన్సీ ప్రాంతంలో ఆధిపత్య  వర్గాల భూములకు పట్టాలిచ్చి.. పేదలకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు.  డిసెంబరులోనే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయని  చెబుతూ.. మరోసారి ఉద్యోగార్ధులను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు, రైతులు చేసే ఉద్యమానికి బీఎస్పీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.  భద్రాచలంలోని దేవాలయం చుట్టూ జరిగే వ్యాపారంలో గిరిజనులు ఎందుకు లేరని  ప్రవీణ్ కుమార్  ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులే కారణమని ఆరోపించారు. కాగా, యాత్రలో భాగంగా భద్రాచలంలో పలుచోట్ల పార్టీ జెండాను ఆయన  ఆవిష్కరించారు. రాజుపేట, భూపతినగర్ కాలనీలలోనూ యాత్ర జరగనుంది.