- మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో చనిపోయినట్లు వెల్లడి
వరంగల్, వెలుగు: ఓరుగల్లు కాకతీయ జూపార్కులో పర్యాటకులను అలరిస్తున్న 15 ఏండ్ల వైట్ టైగర్ శరణ్ మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినట్లు జూపార్క్ పర్యవేక్షణాధికారి మయూరి తెలిపారు. గత ఏడాది జులై 18న దీనిని వరంగల్ కాకతీయ జూపార్కుకు తీసుకువచ్చారు.తెల్లని ఒంటిపై నల్లని చారలతో భారీ సైజ్‌లో ఉన్న టైగర్ ఆరు నెలలుగా స్థానికులతో పాటు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న పర్యాటకులను అలరిస్తోంది.
అయితే.. వైట్ టైగర్ సగటు ఆయుష్షు 14 ఏండ్లు మాత్రమే కావడంతో.. తెల్లని పులి వయోభారం కారణంగా కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 2 నెలలుగా బీపీ, కిడ్నీల సమస్యలతో మరింత ఇబ్బంది పడుతోంది. బీపీ పెరిగిన సమయంలో ఆయాసం ఎక్కువవుతోంది. ఈక్రమంలో జూ అధికారులు స్థానిక వెటర్నటీ డాక్టర్లతో పాటు గతంలో దీనికి సేవలు అందించిన హైదరాబాద్ జూ డాక్టర్లతో కలిసి వైద్యం అందించారు.
రెగ్యులర్‍గా దానికి నచ్చిన లివర్‍తో పాటు చికెన్ వంటి ఆహారం పెట్టినా తినడానికి ఇష్టపడలేదు. రోజురోజుకు నీరసించిపోవడంతో ఎలెక్ట్రో పౌడర్లు, కొబ్బరి నీళ్లు అందించారు. ఆదివారం వాంతులు చేసుకుంది. ఆపై ఆహారం పెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఆది, సోమవారాల్లో ముట్టుకోలేదు. మంగళవారం ఉదయం 7 గంటలకు సిబ్బంది వెళ్లి చూడగా, ఎన్‌క్లోజర్ లో వైట్ టైగర్ చనిపోయి కనిపించింది.
చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి డాక్టర్ల బృందం వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. లివర్ ఫంక్షన్ ఆగిపోవడానికి తోడు ఒక్కొక్కటిగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారించినట్లు మయూరి తెలిపారు. అనంతరం వైట్ టైగర్‌కు అంత్యక్రియలు నిర్వహివంచారు.
