ఇజ్రాయెల్‌లోని ఎయ్లాట్. 70వ మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి అక్కడ. ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్... ఈ జనరేషన్ యంగ్ విమన్ ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ఎలా బయటపడొచ్చు అనే దానిమీద ఒక సలహా ఇవ్వమన్నారు జడ్జిలు. హర్నాజ్ సంధు సమాధానం వినేందుకు అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.
మిస్ యూనివర్స్ కిరీటం.. 21 ఏండ్ల తర్వాత ఇండియాకు వచ్చింది. సోమవారం ఇజ్రాయెల్‌లోని ఎయ్లాట్లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ ఫైనల్ పోటీల్లో బరిలోకి దిగిన 21 ఏండ్ల హర్నాజ్ కౌర్ సంధు.. నయా మిస్ యూనివర్స్‌గా నిలిచింది. పోటీల్లో పాల్గొన్న 78 మంది అందాల భామలను వెనక్కి నెట్టి కిరీటాన్ని గెలుచుకుంది. సుస్మితా సేన్, లారాదత్తా తర్వాత ఈ కిరీటం దక్కించుకున్న మూడో ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది. మాజీ విశ్వ సుందరి ఆండ్రియా మేజా (మెక్సికో).. హర్నాజ్‌కు కిరీటాన్ని అలంకరించింది. మిస్‌యూనివర్స్‌గా ప్రకటించగానే హర్నాజ్ ఆనందంతో ఏడ్చేసింది. ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా, సెకండ్ రన్నరప్‌గా సౌతాఫ్రికాకు చెందిన లలేలా మస్వానే నిలిచారు. కాగా, 1994లో సుస్మితా సేన్, 2000వ సంవత్సరంలో లారా దత్తా మిస్‌యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు.
‘‘తమమీద తమకి నమ్మకం ఉండేలా చేసుకునే విషయంలోనే ఇప్పటి యూత్ ఒత్తిడి ఫేస్ చేస్తోంది. ‘‘మిగతా వాళ్ల కన్నా నేను స్పెషల్” అనే భావనే అందంగా మార్చేస్తుంది. వేరే వాళ్లతో పోల్చుకోవడం మానేసి, ప్రపంచంలోనూ, మన చుట్టూ జరుగుతున్న ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడం మంచిది. నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఎందుకంటే నీ జీవితానికి నువ్వే లీడర్‌వి. నీ గొంతు నీదే. నన్ను నేను నమ్ముతాను. అలా నమ్మాను కాబట్టే ఈ రోజు ఇక్కడ నిలబడగలిగాను” అని చక్కటి జవాబు చెప్పి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది హర్నాజ్.
ఇంత తెలివిగా జవాబు చెప్పిన హర్నాజ్ చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. తనని హేళన చేసిన వాళ్లకు గట్టి సమాధానం ఇవ్వాలన్న పట్టుదల పెరిగింది. అందుకు ఒక గోల్ పెట్టుకుంది. చాలా క్లారిటీతో ఆ గోల్‌ను రీచ్ అయింది. పంజాబ్‌లోని చండీగఢ్‌లో పుట్టి పెరిగింది హర్నాజ్. తల్లి రూబీ సంధు, తండ్రి ప్రీతమ్పాల్ సింగ్ సంధు. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత చండీగఢ్ లోని ‘కాలేజ్ ఫర్ గర్ల్స్’ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివింది. స్కూల్లో చదువుకునే రోజుల్లో చాలా సన్నగా ఉండేది. ‘‘ఉఫ్‌మని ఊదితే కొట్టుకుపోతావ్?’’ అని ఏడిపించే వాళ్లు. పిచ్చి జోకులు వేసేవాళ్లు. ఆ మాటలు, కామెంట్లు హర్నాజ్ మనసును చాలా బాధపెట్టాయి. ఆ మాటల వల్ల ఆమె మనసుకు ఎంత లోతుగా గాయమైందో.. అంతకంటే గట్టిగా తనను చూసి నవ్విన వాళ్లకు ఆన్సర్ ఇవ్వాలన్న పట్టుదల అలాగే పెరిగింది. తనని తాను ప్రూవ్ చేసుకునే జర్నీలో భాగంగా మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2017లో మోడలింగ్ కోర్స్‌లో చేరింది. ఫిట్నెస్, బ్యూటీలపై శ్రద్ధ పెట్టింది. హర్నాజ్ తీసుకున్న నిర్ణయానికి పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.
కాలేజీ స్టేజ్ షోల్లో మిమిక్రీ చేసేది. పాటలు పాడేది. వీటితోపాటు యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేదామెకు. పంజాబీ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. 2017లోనే ‘మిస్ చండీగఢ్’ టైటిల్ గెలుచుకొని తన మీద తనకున్న నమ్మకాన్ని మరింత పెంచుకుంది. ఆ తర్వాత మోడలింగ్ కెరీర్ తిరుగు లేకుండా సాగింది. ‘టైమ్స్ ఫ్రెష్ ఫేస్’, ‘మిస్ చండీగఢ్’, 2018లో ‘మిస్ మ్యాక్స్’, ‘ ఎమర్జింగ్ స్టార్’, 2019లో ‘ఫెమినా మిస్ ఇండియా పంజాబ్’, ‘మిస్ దివా 2021’ టైటిల్స్ గెలుచుకుంది. అదే జోష్‌లో ఇప్పుడు ‘మిస్ యూనివర్స్ టైటిల్’ సొంతం చేసుకుంది.
అమ్మ సపోర్ట్‌తో...
చిన్నప్పుడు మనసును బాధపెట్టిన ఎన్నో మాటలు, మరెన్నో అవమానాలు మౌనంగా భరించింది హర్నాజ్. కూతురి బాధను అర్థం చేసుకున్న తల్లి రూబీ సంధు ఎన్నో విధాలుగా సపోర్టు ఇచ్చింది. అందుకే మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న వెంటనే మొదటి వీడియో కాల్ అమ్మకే చేసింది హర్నాజ్. రూబీ సంధు గైనకాలజిస్ట్. కూతురు మిస్ యూనివర్స్ అయిందని తెలిశాక ఎంతో ఉప్పొంగిపోయి ఆ వీడియో షేర్ చేసింది. రూబీకి సోషల్ సర్వీస్ చాలా ఇష్టం. తల్లి ఆలోచనలే హర్నాజ్‌కు వచ్చాయి. ‘‘ అందం అంటే స్కిన్ టోన్ ఒక్కటే కాదు. ఆత్మవిశ్వాసం, బాధ్యత, మనస్తత్వం కలిసి మహిళల్లో అందాన్ని రెట్టింపు చేస్తాయి”అంటుంది.
సమాజంలో మహిళల హక్కుల కోసం మాట్లాడటంలో ముందుంటుంది. తల్లితో కలిసి హెల్త్ క్యాంపుల్లో పాల్గొంటుంది. మెనుస్ట్రువల్ హైజీన్ గురించి అవేర్నెస్ కల్పించడం, విమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు హర్నాజ్‌కు ఒకరకంగా రెగ్యులర్ యాక్టివిటీ. మోడ లింగ్ కెరీర్లో హర్నాజ్‌కు బాలీవుడ్ నటి ‘ప్రియాంక చోప్రా’ రోల్‌మోడల్.
దాదాపు అన్ని రకాల జంతువుల అరుపులను మిమిక్రీ చేస్తుంది. పాటలు పాడుతుంది. ప్రతిరోజూ యోగా చేస్తుంది. గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, డాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. కుకింగ్ ఇష్టపడే హర్నాజ్‌కు ఇష్టమైన వాళ్లకు వంట చేసి పెట్టడమంటే ఎంతో ఇష్టం. మక్క, రొట్టె, సర్సోంకా సాగ్ తినడం ఎంజాయ్ చేస్తుంది. గ్లూటెన్ ఫ్రీ డైట్ తింటుంది. ‘యాజా దియన్ పూ బరన్’ తో పాటు కొన్ని పంజాబీ సినిమాల్లో నటించింది. 2014 ఇన్‌స్టా గ్రామ్లోకి వచ్చింది. ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ‘పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’లో మాస్టర్స్ చేస్తోంది.
