యడ్డీ రాజీనామా.. తర్వాతి సీఎం ఎవరు?

యడ్డీ రాజీనామా.. తర్వాతి సీఎం ఎవరు?

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవి నుంచి వైదొలిగారు. సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల సభలో యడ్డీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. యడ్డీ రాజీనామాతో కన్నడ నాట రాజకీయాలు ఆసక్తిని సంతరించుకున్నాయి.

ఢిల్లీలో జోరుగా లాబీయింగ్

యడియూరప్ప సీఎం పదవి నుంచి దిగిపోవడంతో ఆశావహులు ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మురుగేశ్ నీరాని, అరవింద్ బెల్లాద్‌తోపాటు యడ్డీ కుమారుడు విజయేంద్ర రేసులో ఉన్నారు. వీరిలో మురుగేశ్, అరవింద్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా.. తాను వ్యతిగత పనులపై ఢిల్లీ వచ్చానని మురుగేశ్ నీరాని చెప్పారు. మూడ్రోజులుగా హస్తినలోనే ఉన్న యడ్డీ కుమారుడు విజయేంద్ర కూడా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరు కాకుండా మరికొందరు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. అయితే కర్నాటక తదుపరి సీఎంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరు తెరపైకి వస్తోంది. ఆయన పేరు పార్టీ పరీశీలనలో ఉన్నట్లు సమాచారం.

కన్నడ రాజకీయాల్లో యడ్డీ ఎందుకు కీలకం?

కర్నాటకలో దశాబ్దాలుగా బీజేపీకి మెయిన్ ఫేస్‌గా ఉన్న యడ్డీ సీఎంగా తప్పుకోవడంతో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారనేది కీలకంగా మారింది. యడ్డీ వారసుడు ఎవరనేది ఇంకా బీజేపీ ప్రకటించలేదు. యడ్డీ నిష్క్రమణపై పలు నెలలుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆయన తప్ప పార్టీలో మరో బలమైన నేత, ప్రభుత్వాన్ని నడిపించే సత్తా కలిగిన నాయకుడ్ని బీజేపీ కనుగొనకపోవడం గమనార్హం. ఎందుకంటే కర్నాటక బీజేపీలో యడ్డీని మించిన శక్తిమంతమైన, పాపులారిటీ, సత్తా, అనుభవం ఉన్న నేత మరొకరు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

బీజేపీ ముందున్న సవాళ్లు

ప్రస్తుతం బీజేపీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి యడ్డీ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసుకోవడం. 2012లో ఆయన బీజేపీకి రెబల్‌గా మారి ఇబ్బందులు పెట్టారు.  అదే సమయంలో పార్టీకి పెద్ద మద్దతుదారుగా ఉన్న లింగాయత్ కమ్యూనిటీ సపోర్టును చేజారిపోకుండా చూసుకోవడం రెండో సవాల్. యడ్డీ కూడా లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారే కావడం గమనార్హం. సీఎం పదవి నుంచి యడ్డీని తొలగిస్తారనే వార్తలపై కొన్ని రోజుల కింద పలు లింగాయత్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో యడ్డీని అదుపు చేయడంతోపాటు లింగాయత్‌ల మద్దతును నిలుపుకోవడం బీజేపీకి పెద్ద చాలెంజ్‌లుగా మారనున్నాయి.