ప్రీతి నాయక్ మృతిపై సర్కారు ఎందుకు స్పందించట్లే

ప్రీతి నాయక్ మృతిపై సర్కారు ఎందుకు స్పందించట్లే

బహుజన సంఘాల డిక్లరేషన్ మీటింగ్ లో నాయకుల మండిపాటు  

ఖైరతాబాద్, వెలుగు:   రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్యాయంగా బలైపోతుంటే కనీస న్యాయం జరగడం లేదని బహుజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధరావత్ ప్రీతి నాయక్ అనుమానాస్పద మృతిపై బహుజన నాయకుల డిక్లరేషన్ మీటింగ్ నిర్వ హించారు. మీటింగ్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోందని.. మరి ప్రీతి ఘటన జరిగిన ఆస్పత్రిలో, కాలేజీలో సీసీ కెమెరాలు ఎందుకు లేవో చెప్పాలన్నారు. అగ్ర కుల అమ్మాయిలకు అన్యాయం జరిగితే వెంటనే న్యాయం చేసే సర్కార్.. బడుగు, బలహీన వర్గాల ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు బాధాకరమని.. సమాజంలో, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ఆడబిడ్డే కదా.. ప్రీతి మృతిపై ఎందుకు స్పందించడంలేదని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కరాటే కల్యాణి ప్రశ్నించారు. లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ.. ప్రీతి ఘటనలో అసలు దోషులకు శిక్ష పడాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేశారు. ఆ కమిటీలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల ఐపీఎస్ లు, డాక్టర్లు ఉండాలన్నారు. సైఫ్ ను, అతని మిత్ర బృందాన్ని సస్పెండ్ చేయాలని, కాలేజ్ ప్రిన్సిపాల్, ఎచ్ఓడీని, సీఐ బోనాల కిషన్ ను ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. మెడిసిన్ పీజీ విద్యార్థులకు రూ. 50 లక్షల బాండ్ ను రద్దు చేయాలన్నారు. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియా,  గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలన్నారు.