భార్య గొంతు కోసిన భర్త..అదనపు కట్నమే కారణం?.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

భార్య గొంతు కోసిన భర్త..అదనపు కట్నమే కారణం?.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

కూకట్‌‌‌‌పల్లి, వెలుగు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్‌‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కైత్లాపూర్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న షేక్ రహీమ్ (32), సుమేరా బేగం(24)లకు 2024లో వివాహం కాగా, వీరికి ఒక కొడుకు ఉన్నాడు. 

పెండ్లి అనంతరం కొద్దిరోజుల నుంచే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు పలుమార్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదు. రహీమ్​ అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా రెండో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఈ వివాదాలు పలు సందర్భాల్లో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన గొడవపై సుమేరా బేగం కూకట్‌‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన రహీమ్ కత్తితో సుమేరా బేగం గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.