హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం.. మాజీ డీజీ భార్య దారుణ హత్య

హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం.. మాజీ డీజీ భార్య దారుణ హత్య
  • నిద్రపోతుండగా నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి హత్య
  • తమ గ్యాంగ్తో కలిసి పక్కా ప్లాన్తో మర్డర్​చేసిన నేపాలీ​ పని మనిషి
  • డబ్బులు, నగల సంచులతో పరార్
  • తెలంగాణ ఎక్స్​ప్రెస్లో ఎక్కినట్టు అనుమానం 
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ ఆనంద్, సీపీ సజ్జనార్​
  • నిందితుల కోసం ఏడు స్పెషల్ ​టీమ్స్ ​ఏర్పాటు

జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్‌‌‌‌లో రిటైర్డ్​ఐపీఎస్​ఆఫీసర్, ఏపీ మాజీ డీజీ ర్యాంకు అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య తనూజ రంజన్​(55)ను నేపాల్​కు చెందిన ముఠా గురువారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేసింది. డబ్బులు, నగల కోసం ఇంట్లో పని చేసే నేపాల్​కు చెందిన మహిళే ప్రధాన సూత్రధారిగా ఈ పని చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

వినయ్ ​రంజన్ ​బెంగళూరులో ఉండడం, పిల్లలు పై ఫ్లోర్లలో ఉండడంతో ఒంటరిగా ఉందని పక్లా ప్లాన్​తో ఈ మర్డర్​చేసినట్టు తెలుస్తోంది. నిద్రపోతున్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేయడంతో చనిపోయినట్టు సమాచారం. గొంతు నులమడం వల్లే చనిపోయిందన్న వాదనలూ వినిపిస్తున్నాయిడీజీపీ సీవీ ఆనంద్, సీపీ​సజ్జనార్​ఘటనా స్థలాన్ని పరిశీలించి.. స్పెషల్​టీమ్స్ను ఏర్పాటు చేశారు.  

నమ్మకస్తురాలిగా ఉంటూ..
1986 బ్యాచ్‌‌‌‌ ఏపీ క్యాడర్​కు చెందిన వినయ్ రంజన్ రాయ్ రిటైర్మెంట్​తర్వాత భార్య పిల్లలతో జూబ్లీహిల్స్​ప్రశాసన్​నగర్​లో ఉంటున్నారు. ఈ ప్రాంతంలోని మూడంతస్తుల బిల్డింగులోని ఫస్ట్​ఫ్లోర్​లో రంజన్​రాయ్​భార్య తనుజా రాయ్, పై అంతస్తులో వారి పిల్లలు ఉంటున్నారు. కొద్ది రోజుల కిందే రంజన్​రాయ్​పనిపై బెంగళూరుకు వెళ్లారు. తనూజ రాయ్​దగ్గర కొంతకాలంగా నేపాల్​కు చెందిన 25 ఏండ్ల కల్పన పనిమనిషిగా చేస్తోంది. కల్పన మరో నేపాలీ మహిళ ద్వారా పనికి కుదిరింది. చెప్పినట్టు వింటూ నమ్మకస్తురాలిగా పేరు తెచ్చుకుంది. 

ఒంటరిగా ఉంటోందని గమనించి..
తనూజా రాయ్ ​ఒంటరిగా ఉంటున్నారని, పిల్లలు పైన ఉంటారని గమనించిన కల్పన.. దోపిడీకి స్కెచ్​వేసింది. మరో ఇద్దరు నేపాలీ వ్యక్తులతో కలిసి తనూజా రాయ్ హత్యకు పథకం రచించింది. రంజన్​రాయ్​లేకపోవడాన్ని చూసి గురువారం అర్ధరాత్రి 2:30 గంటలకు ఇంటి వెనక భాగం నుంచి నేపాల్​కు చెందిన ముగ్గురు యువకులను లోపలికి తీసుకువచ్చింది. బెడ్​రూంలో పడుకున్న తనుజా రాయ్ చేతులను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. తర్వాత గొంతు నులిమి చంపేశారు. 

అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదును పెద్ద బ్యాగులో సర్దుకుని వెనుక గేటు ద్వారా పరారయ్యారు. ఇంత జరిగినా పై అంతస్తుల్లో ఉన్న పిల్లలు గుర్తించలేకపోయారు. ఉదయం వరకు తనుజా రాయ్ గది బయటకు రాకపోవడంతో వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించి అపోలో దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

నాంపల్లిలో తెలంగాణ ఎక్స్​ప్రెస్​ ఎక్కి..
హత్య చేసిన తర్వాత నలుగురు ఆటోలో జూబ్లీహిల్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌కు వెళ్లినట్టు తేలింది. అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైలులో వెళ్లిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాల ద్వారా ఇంట్లో పని చేసే కల్పనను ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకున్నారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఢిల్లీ, లక్నోతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. నిందితులు నేపాల్‌‌‌‌కు పారిపోయే అవకాశముందని భావిస్తూ సరిహద్దు ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు.   

ఆరు స్పెషల్​ టీమ్స్​ ఏర్పాటు చేశాం: సజ్జనార్
నిందితులను పట్టుకునేందుకు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌తో సహా ఆరు స్పెషల్​టీమ్స్​ఏర్పాటు చేసినట్టు సీపీ సజ్జనార్​వెల్లడించారు. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని, నగరంలో నేపాల్ గ్యాంగ్ లపై నిఘా పెంచుతామన్నారు. ఇంట్లో ఎంత నగదు పోయింది? ఎన్ని నగలు చోరీకి గురయ్యాయనేది అంచనా వేస్తున్నామన్నారు. ఇంట్లో పనిమనుషులను నియమించుకునే ముందు తప్పనిసరిగా పోలీసులతో వారి బ్యాక్‌‌‌‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలని నగరవాసులకు సీపీ సూచించారు.