కేసీఆర్ కోర్టుకు వెళ్తారా?.. మేడిగడ్డ డ్యామేజీ కేసులో కోర్టు నోటీసులు

కేసీఆర్ కోర్టుకు వెళ్తారా?.. మేడిగడ్డ డ్యామేజీ కేసులో కోర్టు నోటీసులు
  • హరీశ్ రావు, స్మితా సబర్వాల్, రజత్ కుమార్ తో పాటు మరో నలుగురికి
  • సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్ పై విచారణ

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల 5న భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరవుతారా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మేడిగడ్డ డ్యామేజీపై నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కేసీఆర్, హరీశ్ రావు సహా 8 మందికి నోటీసులు జారీ చేసింది.  

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి ఆ రివిజన్ పిటషన్‌లో పేర్కొన్నారు. మొదట ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశానని, తన పిటిషన్‌ను కొట్టివేసిందని రాజలింగమూర్తి పేర్కొన్నారు. 

దీంతో తాను హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. హైకోర్టు.. జిల్లా కోర్టులో రివిజిన్ పిటిషన్‌ను దాఖలు చేయాలని సూచించడంతోనే తాను పిటిషన్ వేశానని తెలిపారు.  

తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదా..?

బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్లు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని, పోలీసులు కూడా ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్ఐఆర్నమోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని పిటిషనర్ గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతాలోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి సీఎం హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులని పేర్కొన్నారు.

నోటీసులు అందుకున్నది వీళ్లే

1.కేసీఆర్   (మాజీ సీఎం)
2. హరీశ్ రావు    (మాజీ నీటిపారుదల శాఖ మంత్రి)
3. రజత్ కుమార్   ( ఇరిగేషన్ సెక్రటరీ)
4. స్మితాసబర్వాల్  ( సీఎంవో కార్యదర్శి)
5. హరిరామ్        (ఇంజినీర్ ఇన్ చీఫ్​)
6. శ్రీధర్      (  చీఫ్ ఇంజినీర్)
7. కృష్ణారెడ్డి        (మేఘా నిర్మాణ సంస్థ అధినేత)
8.ఎల్ అండ్ టీ   ( నిర్మాణ సంస్థ)