V6 News

రోహిత్‌‌ హిట్‌ అయ్యేనా!

రోహిత్‌‌ హిట్‌ అయ్యేనా!

రోహిత్‌‌ శర్మ పేరు చెప్పగానే వన్డేల్లో మూడు డబుల్‌‌ సెంచరీలు గుర్తొస్తాయి..! కానీ టెస్ట్‌‌లకు వచ్చేసరికి.. ఠక్కున సమాధానం చెప్పలేం..! ఎందుకంటే..  పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడం.. మిడిలార్డర్‌‌లో ఆడించినా రాణించకపోవడం..  కండిషన్స్‌‌, టీమ్‌‌ కాంబినేషన్‌‌ కారణంగా బెంచ్‌‌కే పరిమితం కావడం .. ఇలా రకరకాల కారణాలు చెబుతాం..! వీటన్నింటినీ పక్కనబెడితే లాంగ్‌‌ ఫార్మాట్‌‌లో రోహిత్‌‌ ఓపెనర్‌‌ పాత్రకు న్యాయం చేస్తాడా? ప్రస్తుతం టీమిండియా ఎదుర్కొంటున్న ఓపెనింగ్‌‌ సమస్యను తీరుస్తాడా? లిమిటెడ్‌‌ ఓవర్ల మ్యాచ్‌‌ల్లో మాదిరిగా ఇక్కడా హిట్‌‌ అవుతాడా? అంటే తగిన సమాధానం చెప్పడం కొద్దిగా కష్టమే..!!

క్రికెట్‌‌లో వన్డే ఫార్మాట్‌‌తో పోలిస్తే.. టెస్ట్‌‌లు చాలా భిన్నంగా సాగుతాయి. కానీ ఓ క్రికెటర్‌‌ నైపుణ్యాన్ని అంచనా వేయాలంటే అతన్ని టెస్ట్‌‌లు ఆడించాలి. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం, మరే ఇతర కారణాలతోనో పరిమిత ఓవర్ల మ్యాచ్‌‌ల్లో చెలరేగే క్రికెటర్లు ఐదు రోజుల ఫార్మాట్‌‌లో వెనుకబడిపోతుంటారు.  ఇదే కొవకు చెందే రోహిత్‌‌ శర్మ ..  సౌతాఫ్రికా సిరీస్‌‌లో ఇప్పుడు టీమిండియా ఓపెనర్‌‌గా కొత్త పాత్ర పోషించబోతున్నాడు. లిమిటెడ్‌‌ ఓవర్లలో ఓపెనర్‌‌గా ఆడటం అతని కొత్త కాకపోయినా.. టెస్ట్‌‌ల్లో మాత్రం కొత్తే. 2009–12 మధ్య కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఈ ముంబైకర్‌‌ ఫస్ట్‌‌ క్లాస్‌‌ క్రికెట్‌‌లో ఓపెనర్‌‌ పాత్రను పోషించాడు. ఈ మూడింటిలోనూ అతను పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ఇక అంతర్జాతీయ టెస్ట్‌‌ల్లో అయితే ఓపెనింగ్‌‌ చేయనే లేదు. మిడిలార్డర్‌‌లో ఆడినా పెద్దగా రాణించలేదు. దీంతో ఇన్నాళ్లూ టెస్ట్‌‌ టీమ్‌‌లోకి అతని ఎంట్రీ స్టాప్‌‌ అండ్‌‌ స్టార్ట్‌‌గా సాగింది. మరి ఇప్పుడు వరుసగా అవకాశాలు ఇస్తామని సెలెక్షన్‌‌ కమిటీ చెబుతున్నా.. ఈ అవకాశాన్ని 32 ఏళ్ల రోహిత్‌‌ సద్వినియోగం చేసుకుంటాడా? ప్రతి సెషన్‌‌కు ఓ కొత్త సవాలు ఎదురయ్యే ఈ ఫార్మాట్‌‌లో ఓపెనింగ్‌‌లో టీమ్‌‌ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలకు అతను ఫుల్‌‌స్టాప్‌‌ పెడతాడా? కేవలం టెస్ట్‌‌లకు మాత్రమే ఎంపిక చేసిన నాణ్యమైన ఓపెనర్లే విఫలమైన చోట… మూడు ఫార్మాట్లలో అత్యంత కీలకమైన రోహిత్‌‌ వర్క్‌‌లోడ్‌‌ను ఎలా మేనేజ్‌‌ చేస్తాడు?

ఏడుగురు విఫలం..

ఐసీసీ టెస్ట్‌‌ ర్యాంకింగ్స్‌‌లో టీమిండియా నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌లో ఉందనే అంశాన్ని కాసేపు పక్కనబెడితే.. 2018 నుంచి ఇప్పటివరకు ఓపెనింగ్‌‌ కాంబినేషన్‌‌ కోసం ఏడుగురు ఆటగాళ్లను పరీక్షించింది. రాహుల్‌‌, విజయ్‌‌, ధవన్‌‌, పృథ్వీ షా, పార్థివ్‌‌, మయాంక్‌‌, విహారి ఈ లిస్ట్‌‌లో ఉన్నారు. వీరందరిలో రాహుల్‌‌కు అత్యధికంగా 13 టెస్ట్‌‌లు (26 ఇన్నింగ్స్‌‌) ఆడాడు. ఇందులో 491 రన్స్‌‌ చేసిన ఈ కర్ణాటక ప్లేయర్‌‌ బ్యాటింగ్‌‌ యావరేజ్‌‌ 22.31. అదే సమయంలో ఆడిన పృథ్వీ  118.50 యావరేజ్‌‌తో టాప్‌‌లో ఉండగా, మయాంక్‌‌ (39.28), ధవన్‌‌ (27.36) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రాహుల్‌‌ మాత్రం నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం షా నిషేధంలో ఉన్నాడు. వరుసగా విఫలమవుతున్న ధవన్‌‌, విజయ్‌‌కు మళ్లీ చాన్స్‌‌ ఇవ్వడం కష్టమే. కాబట్టి కుదురుకోవడానికి రోహిత్‌‌కు ఇదే సరైన అవకాశం. రహానె, విహారి.. మిడిలార్డర్‌‌లో ఒదిగిపోయారు కాబట్టి వాళ్ల నుంచి ముప్పు లేదు. విండీస్‌‌పై ఈ ఇద్దరు రాణించడంతో మేనేజ్‌‌మెంట్‌‌ కూడా వీళ్లను మార్చే సాహసం చేయదు.