ముందస్తు ప్రచారంతో జనం బాట పట్టేందుకు కసరత్తులు

ముందస్తు ప్రచారంతో జనం బాట పట్టేందుకు కసరత్తులు

 

  •     వచ్చే నెల రెండో వారం నుంచి టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల నియోజకవర్గ యాత్రలు
  •     రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలుపెట్టనున్న సంజయ్​
  •     ఏప్రిల్​ రెండో వారం నుంచి రేవంత్​ రెడ్డి పాదయాత్ర
  •     రాష్ట్రంలో సత్తా చాటేందుకు ఆప్​ అడుగులు
  •     ఇప్పటికే యాత్రలు ప్రారంభించిన షర్మిల, ప్రవీణ్​ కుమార్​ 

హైదరాబాద్​, వెలుగు: ‘ముందస్తు’ ఎన్నికల ప్రచారంతో రాజకీయ పార్టీలు, నేతలు జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అధికార టీఆర్​ఎస్​ పార్టీ నియోజకవర్గాల్లో యాత్రలను చేపట్టనుంది. రెండో దశ ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ సిద్ధమవుతున్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ కూడా పాదయాత్రకు కసరత్తులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​తో మధ్యలోనే ఆగిపోయిన ‘ప్రజాప్రస్థాన యాత్ర’ను షర్మిల ఇప్పటికే తిరిగి ప్రారంభించారు. ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరిట బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ జనం వద్దకు వెళ్తున్నారు. ఈమధ్యనే పంజాబ్​లో అధికారంలోకి వచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) కూడా యాత్రల ద్వారా తెలంగాణలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. పార్టీలు వేరైనా ప్రతిపక్షాలు ఒకే ఒక్క ఎజెండాతో యాత్రను చేపడ్తున్నాయి. టీఆర్​ఎస్​ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలను జనంలో ఎండగట్టాలని భావిస్తున్నాయి.

ఉగాది తర్వాత టీఆర్​ఎస్​ యాత్రలు

దుబ్బాక, హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్​ఎస్​కు ఘోర పరాభవం..  ఇటు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో సీట్లు రాక.. మజ్లిస్​ పార్టీ మద్దతుతో మేయర్​ పదవిని దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే జనాల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు ఉగాది తర్వాత యాత్రలను చేపట్టాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్​ తొలి వారం నుంచే జనాలకు చేరువయ్యేలా నియోజకవర్గ స్థాయిలో యాత్రలను చేపట్టాలంటూ ఎమ్మెల్యేలకు సూచనలిచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించి ప్రజల్లో వ్యతిరేకతను పోగొట్టాలని నియోజకవర్గ ఇన్​చార్జులకు సూచనలు చేసింది.

అంబేద్కర్​ జయంతి రోజు నుంచి సంజయ్​ యాత్ర

టీఆర్​ఎస్​ వైఫల్యాలను ఎండగట్టడం, ఆ పార్టీనియంతృత్వ పాలనను, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులు, అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో సంజయ్​.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అంబేద్కర్​ జయంతి రోజైన ఏప్రిల్​ 14న జోగులాంబ గద్వాల జిల్లా నుంచి యాత్రను మొదలు పెట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించి పాదయాత్ర కమిటీ ఏర్పాట్లను కూడా చేసేస్తోంది. రెండో విడత సంగ్రామ యాత్ర ప్రారంభానికి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

హైకమాండ్​ అనుమతికి కాంగ్రెస్​ వెయిటింగ్​

రాష్ట్రంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్​ కూడా.. ప్రజల వద్దకు వెళ్లేందుకు నడుంబిగించింది. రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్​ అయ్యాక.. కేడర్​లో కొత్త జోష్​ నిండినా హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్​ కూడా దక్కలేదు. దీంతో అలాంటి ఫలితాలు మళ్లీ రాకుండా ఉండాలంటే జనానికి చేరువవ్వాలన్న ఉద్దేశంతో వచ్చే నెల రెండో వారం నుంచి రేవంత్​ రెడ్డి పాదయాత్రకు పార్టీ నేతలు ప్లాన్​ చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ సర్కార్​, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అనుకుంటున్నారు. అయితే, పాదయాత్రకు హైకమాండ్​ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.  

యాత్రను ప్రారంభించనున్న కేజ్రీవాల్​  

తెలంగాణలో సత్తా చాటేందుకు వీలుగా యాత్రను ప్రారంభిస్తామని పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్​చార్జి సోమ్​నాథ్​ భారతి ఇటీవలే ప్రకటించారు. ఆప్​ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ స్వయంగా ఈ యాత్రను ప్రారంభించనున్నారు. అవినీతి లేని ప్రభుత్వం, టీఆర్ఎస్​ వైఫల్యాలను ఎజెండాలుగా చేసుకుని యాత్రకు ప్లాన్​ చేస్తున్నారు. ఇటు సీపీఐ, సీపీఎం నేతలు కూడా తమకు పట్టున్న నియోజకవర్గాల్లో యాత్రలు చేసి జనానికి దగ్గరవ్వాలని ప్లాన్​ చేస్తున్నారు.