బాలాపూర్ లో పసికందు విక్రయానికి యత్నం.. మహిళ అరెస్ట్

బాలాపూర్ లో పసికందు విక్రయానికి యత్నం.. మహిళ అరెస్ట్

హైదరాబాద్‌ సిటీ పరిధిలోని బాలాపూర్‌లో పసికందు విక్రయానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం నాలుగు రోజుల పసికందును రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళను అరెస్టు చేశారు. శిశువును హెల్త్ చెకప్ కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్‌లో నాలుగు రోజుల పసికందును రూ.5 లక్షలకు విక్రయించే ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. వాహిదా అనే మహిళను అరెస్టు చేశారు. పసికందును స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ శిశు విక్రయం వెనక నిందితురాలు వహిదా ఒక్కరే ఉన్నారా.. ఏదైనా ముఠా  పనిచేస్తుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శిశువు ఎక్కడినుంచి తీసుకొచ్చారు..తల్లిదండ్రులు అనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.శిశువుల అక్రమ విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.