పిల్ల ఉంటే చెప్పండి.. రాహుల్ పెళ్లిపై సోనియాగాంధీ రియాక్షన్

పిల్ల ఉంటే చెప్పండి.. రాహుల్ పెళ్లిపై సోనియాగాంధీ రియాక్షన్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి వార్లల్లోకి ఎక్కింది. అయితే ఈసారి ప్రశ్నించింది మాత్రం హర్యానా మహిళా రైతులు.  రాహుల్ ఆహ్వానంతో సోనియా నివాసానికి వెళ్లిన మహిళా రైతులు.. రాహుల్ పెళ్లి విషయంపై సోనియా గాంధీనే నేరుగా ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీకి ఎప్పుడు పెళ్లి చేస్తారు అని వారు సోనియాను అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన సోనియా గాంధీ.. వారికి సమాధానం ఇచ్చారు.

హర్యానాకు చెందిన మహిళా రైతులు ఇటీవల ఢిల్లీలోని సోనియా గాంధీ  ఇంటికి వెళ్లారు.  సోనియా కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపారు హర్యానాకు చెందిన మహిళా రైతులు.   ఢిల్లీ లోని పలు ప్రాంతాలను చూశాక సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. వారికి సోనియా  కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మహిళలతో సరదాగా ముచ్చటించారు. వారికి విందును కూడా ఏర్పాటు చేశారు. మహిళలతో కలిసి సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు భోజనం కూడా చేశారు.

అయితే ఈ సందర్భంలో  ఓ మహిళా సోనియా గాంధీతో రాహుల్ పెళ్లి గురించి ప్రశ్నించారు. సోనియా గాంధీ చెవిలో.. రాహుల్ గాంధీకి పెళ్లి చేద్దామా? అని అడిగారు. అందుకు సోనియా గాంధీ సంతోషంగా.. మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి అన్నారు. అయితే ఇదంతా పక్కనే కూర్చొని వింటున్న రాహుల్ గాంధీ నవ్వుతూ.. అవుతుంది.. అవుతుంది అని అన్నారు. ఆ తర్వాత సోనియా, ప్రియాంక గాంధీలు మహిళలతో కలిసి చిందులు కూడా వేశారు.

 జులై ఆరంభంలో రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించారు. ఆ సమయంలో సోనీపత్ జిల్లాలోని మదీనా గ్రామానికి వెళ్లారు. అక్కడ రైతులు పొలంలో పని చేసుకుంటుండగా.. వారితో కలిసి రాహుల్ గాంధీ కూడా పనులు చేశారు. ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నడంతో పాటు.. వరినాట్లు కూడా వేశారు. ఆ తర్వాత రైతులతో కలిసి కూర్చొని ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళా రైతులు అప్పుడు రాహుల్‌కు భోజనం కూడా పెట్టారు. అయితే ఆ సమయంలో మహిళా రైతులు తమకు ఢిల్లీ రావాలని ఉందని రాహుల్ గాంధీతో చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ వారిని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి ఆహ్వానించారు. మహిళలు ఢిల్లీ పర్యటించిన వీడియోను రాహుల్ గాంధీ యూట్యూబ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.