హైదరాబాద్‌లో రోడ్డుపై మహిళ ప్రసవం.. బిడ్డ మృతి

హైదరాబాద్‌లో రోడ్డుపై మహిళ ప్రసవం.. బిడ్డ మృతి
  • సర్కారు దవాఖానకు 100 మీటర్ల దూరంలో ఘటన

జవహర్‌‌నగర్, వెలుగు: నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి దగ్గర్లోనే కండ్లు తిరిగి పడిపోయింది. ఆ సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో రోడ్డు పక్కనే ప్రసవం అయింది. పుట్టిన కొద్ది సేపటికే పసికందు ప్రాణాలు పోయాయి. ఇదంతా సర్కారు దవాఖానకు 100 మీటర్ల దూరంలోపే జరిగినా గంటకుపైగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌ మండలం బాలాజీ నగర్‌‌లో జరిగింది. మేడ్చల్‌లో ఉండే  లక్ష్మి (30) అనే మహిళ సోమవారం మధ్యాహ్నం బాలాజీ నగర్‌‌‌‌లోని గవర్నమెంట్ హాస్పిటల్‌‌కు దగ్గరలో కళ్లు తిరిగి పడిపోయింది. నిండు గర్భిణి రోడ్డుపై పడి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆమెకు అక్కడే ప్రసవం అయింది. ఓ యువకుడు గమనించి పక్కనే ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌కు వెళ్లి చెప్పే ప్రయత్నం చేయగా, అక్కడ డాకర్ట్ లేరని సమాధానం చెప్పారు. ఆస్పత్రిలోనే ఉన్న 108, 104 డ్రైవర్లను ఆస్పత్రిలోకి తీసుకెళ్లాలని కోరినా డాక్టర్ లేకుండా తామేం చేయలేమన్నారని చెప్పినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఈ మొత్తాన్ని అతడు వీడియో తీసి, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్‌‌‌‌ చేశాడు. ఈ విషయం జవహర్ నగర్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు 108ను తీసుకుని అక్కడికి వెళ్లారు. అప్పటికే పసికందు మరణించింది.లక్ష్మిని 108లో గాంధీ ఆసుపత్రికి తరలించి  చికిత్స చేస్తున్నారు. ప్రసవమైన తరువాత గంటకుపైగా ఎవరూ పట్టించుకోలేదని, పుట్టిన బిడ్డ మరణించడానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు అంటున్నారు.

పండుగని వెళ్లిపోయిన ఒక డాక్టర్, సెలవులో మరో డాక్టర్
ఆస్పత్రిలో ఉండాల్సిన డాక్టర్ ఒకరు సోమవారం హోలీ పండుగ అని వచ్చి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు. మరో ఇన్‌‌‌‌చార్జ్ డాక్టర్ సెలవులో ఉన్నారు. స్టాఫ్ నర్సులు, ఆస్పత్రిలో 108, 104 అంబులెన్సులు ఉన్నా వాళ్లూ  స్పందించలేదు. రోడ్డు పక్కన ప్రసవం అయిన తర్వాతైనా వెంటనే హాస్పిటల్ సిబ్బంది స్పందించి ఉంటే పసికందు ప్రాణాలు కాపాడి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.  ఈ ఘటనపై ‘వెలుగు ప్రతినిధి’ బాలాజీనగర్ పీహెచ్‌‌‌‌సీ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ డాక్టర్ శ్రీనివాస్‌‌‌‌తో ఫోన్‌‌‌‌లో మాట్లాడగా.. ‘ఆమె ఆస్పత్రికి వచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె బోధకాలు సమస్యతో బాధపడుతోంది. ఆ కాలికి గాయం కావడంతో 11.30 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు స్టాఫ్‌‌‌‌ నర్సు పారాసిటమాల్ ఇచ్చి పంపింది. ఈ విషయం నర్సు ఫోన్‌‌‌‌ చేసి నాతో చెప్పారు’ అని వివరించారు. ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంపై ప్రశ్నించగా, తాను లీవ్‌‌‌‌లో ఉన్నానని, మరో డాక్టర్ హోలీ పండుగ అని ఉదయం వచ్చి, 11 గంటలకే వెళ్లిపోయారని చెప్పారు. అయితే ఆమెకు నెలలు నిండిన విషయం తమ సిబ్బంది గుర్తించలేకపోయారన్నారు.