2, 500కుపైగా ఐకేపీ కేంద్రాలు మూత పడే ప్రమాదం

2, 500కుపైగా ఐకేపీ కేంద్రాలు మూత పడే ప్రమాదం
  • 2, 500కుపైగా ఐకేపీ కేంద్రాలు మూత పడే ప్రమాదం
  • ఒక్కో వీవోకు రూ.4 లక్షల వరకు నష్టం 

హైదరాబాద్, వెలుగు: వచ్చే యాసంగిలో వడ్లు కొనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన రాష్ట్రంలోని మహిళా సంఘాల ఉపాధి, ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపనుంది. సర్కార్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500కుపైగా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూతపడనున్నాయి. వీటి ద్వారా స్వయం సహాయక సంఘాలకు కమీషన్ రూపంలో వస్తున్న కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడనుంది.  సర్కార్ నుంచి వచ్చే రివాల్వింగ్ ఫండ్, మ్యాచింగ్ గ్రాంట్ నిలిచిపోనుంది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైతులతోపాటు మహిళా సంఘాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. 

ఒక్కో సీజన్ కు రూ.50 కోట్ల ఆదాయం 
ప్రతి సీజన్‌లో ప్రభుత్వం సివిల్ సప్లై, పీఏసీఎస్ లు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 5- వేల నుంచి 6  వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండేది. కొనుగోలు చేసిన ఒక్కో క్వింటా వడ్లపై ఏ గ్రేడ్ కు రూ.32, కామన్ గ్రేడ్ రకానికి రూ.31.50 చొప్పున మహిళా సంఘాలకు కమీషన్ అందుతోంది. నిరుడు వానాకాలం ఐకేపీ ఆధ్వర్యంలో 1,771 సెంటర్లు ప్రారంభించగా 70, 20,507 క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. తద్వారా రూ.22.46 కోట్ల కమీషన్ మహిళా సంఘాలకు వచ్చింది. గత యాసంగిలో 2,144 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1.27 కోట్ల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, 43.84 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ యాసంగిలో సెంటర్లు తెరిస్తే రూ.50 కోట్ల వరకు కమీషన్ వస్తుందని అధికారులు అంచనా వేశారు. సెంటర్లు ప్రారంభించబోమని సర్కారు ప్రకటించడంతో ఒక్కో సెంటర్‌‌‌‌లో పని చేస్తున్న ఐదారుగురు మహిళల చొప్పున12 వేల నుంచి 15 వేల మంది ఉపాధి కోల్పోనున్నారు.