నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్గాదె సంధ్యారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం కలెక్టరేట్లోని ఏఓ(అడ్మినిస్ట్రేటివ్ఆఫీసర్) మోతీలాల్‌ను కలిసి రాజీనామా లెటర్ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన తనను ఎమ్మెల్యే భూపాల్టీఆర్ఎస్లో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. రెండున్నర ఏండ్లుగా గ్రామంలో చేయించిన పనులకు కనీసం ఒక్క బిల్లు కూడా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చెక్కులపై సంతకాలు పెట్టకుండా ఉప సర్పంచ్‌ని ఆపుతున్నారని తెలిపారు. తిప్పర్తి మండల జనరల్ బాడీ మీటింగులో ఎల్లమ్మగూడెం సర్పంచుకు ఏ ఒక్క ఆఫీసరూ సహకరించొద్దని ఎమ్మెల్యే బహిరంగంగా ఆదేశించారన్నారు. మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా పోలీసులతో సభ నుంచి బయటకు గెంటించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే తనను ఎన్నో రకాలుగా అవమానపరిచారని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
