V6 News

మహిళా రిజర్వేషన్‌‌ బిల్లులో ‘మహిళ’ అనే పదమే లేదు : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు

మహిళా రిజర్వేషన్‌‌ బిల్లులో ‘మహిళ’ అనే పదమే లేదు : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు
  •     డీలిమిటేషన్‌‌కు కేంద్ర 50:50 సీట్ల పెంపు ఫార్ములా చట్టబద్ధంగా నిలవదు: కే.కేశవరావు
  •     పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచాలి: కోదండరాం
  •     పార్లమెంట్‌‌లో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని బుల్డోజ్ చేస్తున్నది: ఎంపీ చామల 

హైదరాబాద్, వెలుగు: కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లులో అసలు ‘మహిళ’ అన్న పదమే లేదని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు (కేకే) విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో మహిళా రిజర్వేషన్లను కాలయాపన చేయవద్దని ఆయన డిమాండ్ చేశారు. గంట సమయం ఇస్తే 50 శాతం సీట్లు పెంచుతామని గొప్పలు చెప్పిన అమిత్ షా.. డీలిమిటేషన్ నిబంధనను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. గతంలో జవహర్‌‌లాల్ నెహ్రూ విధించిన సీట్ల ఫ్రీజ్ గడువు వచ్చే సెప్టెంబర్‌‌తో ముగుస్తుందని, ఆ తర్వాత కొత్తగా జనగణన చేపట్టి సీట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. బుధవారం ఎంపీ చామల, ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాంతో కలిసి మీడియా సమావేశంలో కేకే మాట్లాడారు. 

కేంద్రం ప్రతిపాదిస్తున్న 50:50 సీట్ల పెంపు ఫార్ములా చట్టబద్ధంగా నిలవదని, దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయస్థానం అనుమతి ఇవ్వదని కే కేశవరావు హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలను ‘రేవంత్ ఫార్ములా’గా  పేర్కొన్నారు.  రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, సీట్లు కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి  ఆధారంగా పెరగాలన్నదే సీఎం ఉద్దేశమని స్పష్టం చేశారు. 

కేవలం జీఎస్డీపీ మాత్రమే కాకుండా, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకునే ‘మల్టిపుల్ క్రైటీరియా’ ఫార్ములా దేశానికి దిక్సూచిగా మారుతుందని, కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత రెండు మూడు రోజులుగా విభజన అంశాలపై జరుగుతున్న చర్చల్లో భాగంగా, విభజన చట్టానికి రాజ్యాంగానికి మధ్య ఉన్న లింకును పరిశీలిస్తే, డీలిమిటేషన్‌‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లు తేవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.  

న్యాయపర అడ్డంకులు లేకుండా చేయాలి

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సాధ్యమేనని, అందుకు ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 170కి స్వల్ప సవరణలు చేస్తే సరిపోతుందని ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం సూచించారు. విభజన చట్టంలోని క్లాజ్ 26 ప్రకారం సీట్ల పెంపు ప్రక్రియను చేపట్టవచ్చని, సెక్షన్ మార్పు ద్వారా రెండు రాష్ట్రాల్లోనూ అదనపు నియోజకవర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వివరించారు. రాజ్యాంగ నిబంధనలు  –విభజన చట్టం మధ్య సమన్వయం కుదిరితేనే న్యాయపరమైన అడ్డంకులు ఉండవని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోదండరాం కోరారు. 

కేంద్రంలోని బీజేపీ తీరును భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. పార్లమెంట్‌‌లో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లు పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ గంటల తరబడి మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ఈ బిల్లు ఎలాగో వీగిపోతుందని బీజేపీకి ముందే తెలుసని, అందుకే ప్రధాని ప్రసంగం తర్వాత నిరసనలు తెలపడానికి వారు ముందే ప్లాన్ చేసుకున్నారని విమర్శించారు. మహిళల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.