- కొనసాగుతున్న భూసార పరీక్షలు
- యుటిలిటీ షిఫ్టింగ్పై విద్యుత్, టెలిఫోన్, ట్రాఫిక్ పోలీసులతో సమావేశాలు పూర్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో హెచ్ సిటీ కింద చేపట్టిన పనులు స్పీడప్ అయ్యాయి. రూ.7,038 కోట్లతో ఐదు ప్యాకేజీల కింద 23 ప్రాజెక్టులు చేపట్టగా పనులను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఈ పనుల్లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1090 కోట్లతో ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టారు. రూ.930 కోట్లతో రెండు ప్యాకేజీల కింద ఈ ప్రాజెక్టు సివిల్ పనులు, యుటిలిటీల బదలాయిపంపు పనులను చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అంతకు ముందే టెండర్ల ప్రక్రియ చేపట్టగా మెగా కంపెనీ దక్కించుకుంది. స్థల సేకరణకు సంబంధించి కోర్టులో వివాదాలున్నాయి. దీంతో వివాదాలు లేని చోట పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.
రెండేండ్లలో పూర్తి..
ప్రాజెక్టు పనుల్లో భాగంగా బల్దియా రెండు నెలల్లో పనులు మొదలుపెట్టనున్నది. పనుల ప్రారంభంపై ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్, టెలిఫోన్ అధికారులతో జీహెచ్ఎంసీ అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం భూసార పరీక్షలు, గ్లోబల్పొజిషన్ రిఫరెన్స్ (జీపీఆర్) సర్వేలు కొనసాగుతున్నాయి. రెండేండ్లలోనే ఈ పనులు పూర్తికానున్నాయి. మొత్తం ఏడు ఫ్లైఓవర్లకి సంబంధించి వందకిపైగా పిల్లర్లు రానున్నాయి. దీంతో పాటు అమీన్ పూర్ రోడ్డు నిర్మాణ పనులను శివ సత్య ఏజెన్సీ, కూకట్ పల్లి వై జంక్షన్ లో అటు మియాపూర్ వరకు, ఇటు అమీర్ పేట వైపు రెండు డైరెక్షన్లలో నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను స్థల సేకరణ మినహా రూ.112 కోట్లతో సివిల్ పనులను కేఎన్ఆర్ సంస్థ చేపట్టనున్నది.
ప్రస్తుతం గ్రౌండింగ్ అవుతున్న ఈ పనులు మరో నెల రోజుల్లో ఫీల్డ్ లెవెల్ లో ఊపందుకోనున్నాయి. అలాగే, ఆర్కేపురం, శేరిలింగంపల్లిలో రెండు ఆర్వోబీలకు ఇప్పటికే రైల్వే నుంచి క్లియరెన్స్ రావడంతో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు. టెండర్లు చేపట్టని హెచ్ సిటీ పనులకు ఈ నెల 7వ తేదీలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
