‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ అన్నాడు మనసు కవి ఆత్రేయ. ఆ మాటను పాటగా మార్చాడు మంగళంపల్లి బాల మురళీ కృష్ణ. ఇది నిన్నామొన్నటి తరం సంగతి. ఇప్పుడు టెక్నాలజీ వరల్డ్. మాటలు, పాటలు చెప్పే ఎమోషన్‌ను ఎమోజీగా మార్చేశారు. ‘ఎమోజీయే నీ ఎమోషన్ ఓ హ్యూమనూ’ అని పాడుకుంటున్నారు.
ఆదిమానవునికి సైగలు, ఆ తర్వాత నాగరికునికి మాటలు, పాటలు, బొమ్మలు.. వీటితోపాటు ఇప్పుడు ఎమోజీలు. అలిగితే.. బుంగమూతి. బాధ కలిగితే.. కన్నీళ్లు. సిగ్గు పడితే.. బుగ్గలు ఎరుపు. నవ్వితే.. ఆనందబాష్పాలు. ఒక్కటేమిటి.. ఇలా ప్రతి ఒక్క భావానికి ఒక్కో ఎమోజీ వచ్చింది. ఇది ఎమోజీ లాంగ్వేజ్. సైగల్లాగే ఇది కూడా ప్రపంచ భాష. మాటలక్కర్లేని బొమ్మల భాష.
ఏ భాష ఎప్పుడు పుట్టిందో ఎవరూ కరెక్టుగా చెప్పలేరు. ఎమోజీదీ అదే కథ. కానీ, రికార్డ్స్ ప్రకారం ఎమోజీకి 1999లో మొదట జపాన్‌లోని ఎన్టీటీ డొకొమొ అనే ఒక సెల్‌ఫోన్ కంపెనీ ప్రాణం పోసింది. షిగెటక కురిట అనే వ్యక్తి వీటిని తయారు చేశాడు. మాటలతో సంబంధం లేకుండా వివిధ భావాలను చెప్పే176 ఎమోజీలను తెచ్చాడు. జపనీస్‌లో ఎమోజీ అంటే పిక్చర్ ప్లస్ లెటర్. అంటే బొమ్మ, అక్షరం లేక పదం. ఈ ‘ఎమోజీ’కి ఇంగ్లీషులోని ‘ఎమోషన్’కు పోలిక ఉండడం గమనించొచ్చు. నిజానికి ఎమోజీల కంటే ముందే 1982లో ఎమోటికాన్స్(ఎమోషన్ + ఐకాన్) వచ్చాయి. వీటిని స్కాట్ పల్మన్ అనే అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ తయారు చేశాడు.
2000 సంవత్సరం నుంచి ఎమోజీల వాడకం ఎక్కువైంది. ఇప్పుడైతే మొబైల్లో చాటింగ్‌కు ఎక్కువగా ఉపయోగించేది వీటినే. ఎమోజీలు, వాటిలోని రకాలు, అవి చెప్పే అర్థాల గురించి 2014లో జెరెమీ బర్గ్ అనే ఆయన ‘ఎమోజీపీడియా’ అనే వెబ్సైట్ పెట్టాడు. ఈయనే జులై 17ను ‘వరల్డ్ ఎమోజీ డే’ అని మొదట చెప్పాడు. ప్రస్తుతం ‘ఎమోజీపీడియా’ ప్రకారం మొత్తం 1800కు పైగా ఎమోజీలు ఉన్నాయి. ఇందులో ఫేస్ ఎమోజీలు, ఫుడ్, ట్రీస్, హౌసెస్, స్పోర్ట్స్ కిట్స్, రూట్స్ వంటివన్నీ కనిపిస్తాయి.
