మెక్సికోలో డ్రగ్ డాన్ కాల్చివేత.. ఎల్ మెంచో మృతితో అనుచరుల విధ్వంసం

మెక్సికోలో  డ్రగ్ డాన్ కాల్చివేత.. ఎల్ మెంచో మృతితో అనుచరుల విధ్వంసం
  • దేశవ్యాప్తంగా అట్టుడుకుతున్న నగరాలు
  • రోడ్లపై వాహనాలకు నిప్పు.. 
  • షాపులు ధ్వంసం
  • ఎక్కడికక్కడ మూతపడ్డ దుకాణాలు
  • ఇండియన్లకు అక్కడి ఎంబసీ అడ్వైజరీ జారీ
  • ఎల్ మెంచో తలపై రూ.125 కోట్ల రివార్డు

మెక్సికో సిటీ: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్, ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ (సీజేఎన్ జీ) అధినేత ‘‘నెమెసియో ఒసెగువేరా (ఎల్ మెంచో)’’ కథ ముగిసింది. మెక్సికన్ సైన్యం జరిపిన మెరుపు దాడిలో ఈ ‘మోస్ట్ వాంటెడ్’ నేరస్థుడు హతమయ్యాడు. ఈ ఘటనతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఎల్ మెంచో అంతం మెక్సికో ప్రభుత్వానికి, అమెరికాకు పెద్ద విజయమే అయినప్పటికీ, ఈ డ్రగ్ సామ్రాజ్య వారసత్వం కోసం మిగిలిన ముఠాల మధ్య ఆధిపత్య పోరు మొదలై హింస మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమ నాయకుడి మరణవార్త తెలియగానే సీజేఎన్ జీ గ్యాంగ్ సభ్యులు ప్రతీకారంతో ఊగిపోయారు. 

ముఖ్యంగా జాలిస్కో, గ్వాడలజరా వంటి నగరాల్లో వీరంగం సృష్టించారు. వందలాది వాహనాలకు నిప్పు పెట్టారు. రహదారులపై టైర్లు తగులబెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. పర్యాటక నగరం ‘‘పుంటా వల్లార్టా’’ నల్లటి పొగతో నిండిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పర్యాటకులు ప్రాణ భయంతో విమానాశ్రయాల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

ఆపరేషన్ ఎలా జరిగిందంటే..

జాలిస్కో రాష్ట్రంలోని ‘‘తపాల్పా’’ అనే చిన్న పట్టణంలో ఎల్ మెంచో దాక్కున్నాడని అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో మెక్సికన్ స్పెషల్ ఫోర్స్ దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆదివారం తెల్లవారుజామున సైన్యం ఎల్ మెంచో స్థావరాన్ని ముట్టడించింది. రెండు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. 

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచోను కస్టడీలోకి తీసుకున్న సైన్యం, హెలికాప్టర్​లో మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలంలో రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆటోమేటిక్ రైఫిళ్లు మరియు సాయుధ వాహనాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇతనితో పాటు మరో 9 మంది ముఠా సభ్యులు కూడా మరణించారు.

హేమిటో.. మాకన్నీ విజయాలే: ట్రంప్

ఎల్​ మెంచో ఎన్ కౌంటర్​పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెటైరికల్​గా స్పందించారు. ‘‘మనం విపరీతంగా గెలుస్తున్నాం, ఇది అసలు న్యాయమే కాదు!’’ అంటూ అమెరికన్లను ఉద్దేశించి ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్ట్ చేశారు. ఎల్ మెంచో తలపై గతంలో అమెరికా ‘‘15 మిలియన్ డాలర్ల (రూ.125 కోట్లు)’’ రివార్డు ప్రకటించింది. ఈ ఆపరేషన్‌‌‌‌లో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనలేదని, కేవలం "ఇంటెలిజెన్స్" మాత్రమే అందించిందని మెక్సికో స్పష్టం చేసింది.

ఎవరీ ఎల్ మెంచో..

అసలు పేరు నెమెసియో రూబెన్ ఒసేగురా సెర్వంటెస్. మెక్సికోలో అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లర్. అత్యంత పేరుమోసిన నేరస్థుల్లో ఒకడు. 1980లో అమెరికాకు వెళ్లి అక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. జైలు శిక్ష పూర్తయ్యాక  సొంత దేశానికి తిరిగి వచ్చి పోలీస్‌ డిపార్ట్ మెంట్లో చేరాడు. డబ్బుపై ఆశతో మళ్ళీ డ్రగ్స్ దందాలోకి దిగాడు. సొంతంగా 'సీజేఎన్ జీ' అనే ముఠాను ఏర్పాటు చేసి అమెరికాకు భారీగా కొకైన్, హెరాయిన్, ఫెంటానిల్, మెథాంఫేటమిన్ లాంటి డ్రగ్స్ పంపిణీ చేశాడు. ఇతన్ని పట్టుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఏకంగా  సుమారు కోటిన్నర డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.