మన స్టార్ రెజ్లర్ ను ఓడించిన రెఫరీ

మన స్టార్ రెజ్లర్ ను ఓడించిన రెఫరీ
  • సెమీస్‌‌లో బజ్​రంగ్​ పరాజయం
  • వివాదాస్పదమైన బౌట్‌‌
  • ఓడినా ఒలింపిక్స్​కు పునియా
  • రవి దహియా కూడా
  • నేడు కాంస్య పతక పోరు

ఆరంభంలో వెనుకబడ్డా.. కీలక సమయంలో ఉడుంపట్టు పట్టాడు..!  ప్రత్యర్థి సర్కిల్‌‌ దాటిపోకుండా అదిమి పట్టినా.. పాయింట్లు మాత్రం దక్కలేదు..! ఒకానొక దశలో ప్రత్యర్థికి ఊపిరి కూడా అందనీయలేదు..! గిలగిల కొట్టుకుంటున్న స్థానిక రెజ్లర్‌‌ను చూసి రిఫరీలే మూడుసార్లు రూల్స్‌‌ను తుంగలో తొక్కారు..! ఫ్రస్ట్రేషన్‌‌లో ఇండియన్‌‌ రెజ్లర్‌‌ చేయి పైకెత్తి నిరసన తెలిపినా.. పట్టించుకున్న పాపాన పోలేదు..! చివరాఖరుకు అద్భుతమైన టెక్నిక్స్‌‌తో స్కోర్లు సమం చేసినా.. లోకల్‌‌ రెజ్లర్‌‌కే పట్టం కట్టారు..! ఓవరాల్‌‌గా వివాదాస్పదంగా ముగిసిన సెమీస్‌‌ బౌట్‌‌లో ఇండియన్‌‌ స్టార్‌‌ రెజ్లర్‌‌ బజ్‌‌రంగ్‌‌ ఓడినా.. టోక్యో ఒలింపిక్స్‌‌ బెర్త్‌‌ మాత్రం దక్కింది..!!

నూర్‌‌ సుల్తాన్‌‌ (కజకిస్థాన్‌‌):

వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌‌కు ఇండియా నుంచి మరో ఇద్దరు రెజ్లర్లు అర్హత సాధించారు. టాప్‌‌ రెజ్లర్‌‌ బజ్‌‌రంగ్‌‌ పూనియా (65 కేజీ), రవి దహియా (57 కేజీ) సెమీస్‌‌లో  ఓడినా.. ఒలింపిక్స్‌‌ బెర్త్‌‌లు దక్కించుకున్నారు. గురువారం జరిగిన 65 కేజీ సెమీస్‌‌ బౌట్‌‌లో బజ్‌‌రంగ్‌‌ 9–9తో దౌలత్‌‌ నియాబెకోవ్‌‌ (కజకిస్థాన్‌‌) చేతిలో ఓడాడు. ఆరంభంలో ప్రత్యర్థి టెక్నిక్‌‌ను అంచనా వేయలేకపోయిన పూనియా 2–9తో వెనుకబడ్డాడు. కానీ చివరి నిమిషాల్లో ఇండియన్‌‌ రెజ్లర్‌‌ ఉడుంపట్టుకు నియాబెకోవ్‌‌ గింజుకున్నాడు. సర్కిల్‌‌ దాటి పోకుండా నియాబెకోవ్‌‌ను అదిమి పట్టినా.. రెఫరీ మాత్రం నాలుగు పాయింట్లు అతనికే కట్టబెట్టాడు.

wrestler bajrang punia defeatఇలా బౌట్‌‌ జరుగుతున్నంతసేపు రెఫరీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. బజ్‌‌రంగ్‌‌ పట్టు నుంచి తప్పించుకుని అలసట తీర్చుకునేందుకు దౌలెత్‌‌కు మూడుసార్లు కావాల్సినంత సమయం ఇచ్చారు. ఇది రూల్స్‌‌కు విరుద్ధమైనా కనీసం ఒక్కసారి కూడా హెచ్చరించలేదు. ఓ దశలో బజ్‌‌రంగ్‌‌ నిరసనగా చేయి పైకెత్తినా పట్టించుకోలేదు. చివరి రౌండ్‌‌ వరకు హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌‌ను బజ్‌‌రంగ్‌‌ 9–9తో స్కోరు సమం చేసినా.. రిఫరీ మాత్రం నియాబెకోవ్‌‌ను విజేతగా ప్రకటించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇండియన్‌‌ రెజ్లర్‌‌ కోచ్‌‌ షాకో బెంటిడిస్‌‌… కోచెస్‌‌ బ్లాక్‌‌ను తన్నుతూ నిరసన వ్యక్తం చేశాడు.  నియాబెకోవ్‌‌ను హోల్డ్‌‌ చేసినప్పుడు కనీసం రెండు పాయింట్లైనా బజ్‌‌రంగ్‌‌కు ఇవ్వాల్సిందన్నాడు. మరోవైపు లోకల్‌‌ రెజ్లర్‌‌కు ఫేవర్‌‌గా ఈ బౌట్‌‌ జరిగిందని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో కోచ్‌‌ వెల్లడించాడు.  ఓవరాల్‌‌గా ఈ టోర్నీలో గోల్డ్‌‌ మెడల్‌‌ లక్ష్యంగా బరిలోకి దిగిన బజ్‌‌రంగ్‌‌ రిఫరీ తప్పుడు నిర్ణయానికి సెమీస్‌‌లోనే వెనుదిరగాల్సి వచ్చింది.

నిరాశపర్చిన పూజ..

మహిళల విభాగంలో ఇండియన్‌‌ రెజ్లర్ల పోరాటం ముగిసింది. 59 కేజీల కాంస్య పతక పోరులో పుజా దండ 3–5తో జింగ్రు పే (చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సాక్షి మాలిక్‌‌ (62 కేజీ), దివ్య కక్రాన్‌‌ (68 కేజీ) కూడా తొలిరౌండ్‌‌ను దాటలేకపోయారు. ఈ రౌండ్‌‌లో సాక్షి 7–10తో అమినత్‌‌ (నైజీరియా) చేతిలో ఓడింది. రెపిచేజ్‌‌ అవకాశం కోసం ఎదురుచూసినా.. అమినత్‌‌ క్వార్టర్స్‌‌లోనే వెనుదిరగడంతో  సాక్షి ఆశలు ఆవిరయ్యాయి.

రవి కూడా..

పురుషుల 57 కేజీల సెమీస్‌‌లో రవి 4–6తో వరల్డ్‌‌ చాంపియన్‌‌ జావుర్‌‌ ఉగెవ్‌‌ (రష్యా) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన తొలి రెండు బౌట్లను రవి టెక్నికల్‌‌ సుపిరియారిటీతో గెలిచాడు. ఇక క్వార్టర్స్‌‌లో 6–1తో మాజీ వరల్డ్‌‌ చాంపియన్‌‌ యుకీ తకాహషి (జపాన్‌‌)పై నెగ్గి సెమీస్‌‌తో పాటు ఒలింపిక్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకున్నాడు.  శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో బజ్‌‌రంగ్‌‌, రవి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.